ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. వితంతువులకు జూన్ 12నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం రోజు నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ తక్షణమే న్యాయం చేయాలని, సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్త వుతున్న సందర్భంగా జూన్ 12 నుంచి వితంతువులకు కొత్తపింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం త్వరలోనే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నట్టుగా చెప్పారు. ఈ మేరకు లబ్ధిదారులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రెవెన్యూ సమస్యలు ఉత్పన్నమయ్యాయని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టుగా చెప్పారు.
ఇదిలాఉంటే, గత వైసీపీ ప్రభుత్వ పాలనపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ఐదేళ్ల వైఎస్ జగన్ అరాచక పాలనలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రైతాంగాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైసీపీ నాయకులు.. ఇప్పుడు రైతులపై కపట ప్రేమ ఒలకబోయడం అత్యంత విడ్డూరంగా ఉందని అన్నారు. రైతు భరోసా అని గొప్పలు చెప్పుకున్న వైసీపీ హయాంలో వాస్తవంగా రైతులకు ఎక్కడా భరోసా లేకుండా చేశారని విమర్శించారు. సరైన సమయానికి విత్తనాలు, ఎరువులు అందించలేని చేతకానితనంతో రైతులను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
నాడు మామిడి, మొక్కజొన్న రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసినా పట్టించుకోని నాటి పాలకులు... హార్టికల్చర్ రంగాన్ని నాశనం చేసి, ఎగుమతులు తగ్గించి, మార్కెటింగ్ వ్యవస్థను కుప్పకూల్చారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. రైతులను దళారుల చేతుల్లో పెట్టేసి, కేవలం ప్రచార రాజకీయాలకే పరిమితమయ్యారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు న్యాయం జరిగేలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సమీక్షిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. మామిడి రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు, కొనుగోలు కేంద్రాలు, ధరల స్థిరీకరణపై ఇప్పటికే చర్యలు ప్రారంభించామని చెప్పారు. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర అందేలా అధికారులతో నిరంతరం పర్యవేక్షణ చేయిస్తున్నామని తెలిపారు.
రైతుల సమస్యలపై మా ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. చౌకబారు విమర్శలు, రాజకీయ డ్రామాలు కట్టిపెట్టండి, ప్రజలన్నీ గమనిస్తున్నారని చెప్పారు. రైతుల ప్రయోజనాల కోసం, వారి సంక్షేమం కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవడానికి మా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
Read more news like this on telugu.timesnownews.com

