Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూన్ 6న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన... యువతకు అభిజీత్ దీప్కే పిలుపు

జూన్ 6న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన... యువతకు అభిజీత్ దీప్కే పిలుపు

Times Now Telugu 4 days ago

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఈ నెల 6వ తేదీన ఢిల్లీకి వస్తున్నారు. అదే రోజున ఢిల్లీలో నిరసన చేపట్టాలని కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది.

పరీక్షల నిర్వహణలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సమర్పించాలనే డిమాండ్ కాక్రోచ్ జనతా పార్టీ నిరసన చేపట్టనుంది. ఈ క్రమంలోనే విదేశాల్లో ఉన్న అభిజీత్ దీప్కే ఢిల్లీకి చేరుకుని... కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించే నిరసల్లో పాల్గొననున్నారు. తాను భారతదేశానికి తిరిగి రానున్న విషయాన్ని అభిజీత్ దీప్కే ఒక వీడియో సందేశంలో వెల్లడించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ శాంతియుత నిరసన చేపట్టేందుకు జూన్ 6న భారతదేశానికి తిరిగి వస్తానని తెలిపారు.

ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించే నిరసనలో తాను భాగస్వామ్యం కానున్నట్టుగా చెప్పారు. తన మద్దతుదారులకు, విద్యార్థులకు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జూన్ 6వ తేదీన విమనాశ్రయం వెలుపల తనను కలుసుకుని ముందుకు సాగాలని కోరారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేపట్టేందుకు పార్లమెంట్ స్ట్రీట్ పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకుందామని చెప్పారు.

''భారత రాజ్యాంగ మార్గాన్ని అనుసరిస్తూ మనమందరం ఏకమై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ శాంతియుతంగా మన గళాన్ని వినిపించాల్సిన సమయం ఆసన్నమైంది. మనమందరం కలిసి గళం విప్పితే... వారు తప్పకుండా మన మాట వింటారు. నేను జూన్ 6 (శనివారం) ఉదయం ఢిల్లీకి చేరుకోవాలని నిర్ణయించుకున్నాను. దయచేసి విమానాశ్రయం వద్ద నాతో కలవండి. మనమందరం కలిసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేపట్టేందుకు అనుమతి కోరదాం'' అని అభిజీత్ దీప్కే అన్నారు.

పరీక్షలలో చోటుచేసుకున్న అవకతవకలు, అంతరాయాల వల్ల విద్యార్థులు ఆందోళనకు గురయ్యారని అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఇందుకు ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేశారు.

అలా కాక్రోచ్ జనతా పార్టీ...
కాక్రోచ్ జనతా పార్టీ ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ప్రజాదరణను సొంతం చేసుకుంది. అయితే కొద్ది రోజుల కిందట సుప్రీం కోర్టులో ఓ కేసు విచారణ సందర్బంగా విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సోషల్ మీడియాలోని యువ భారతీయులను "బొద్దింకలు", "పరాన్నజీవులు"తో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారనే వార్తలు వచ్చాయి. అయితే దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది ఒక సెటైరికల్ ఉద్యమానికి దారితీసింది. ఈ క్రమంలోనే కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటైంది.

అయితే నిరుద్యోగ యువతపై తాను చేసిన బొద్దింకల వ్యాఖ్యపై విమర్శలు వెల్లువెత్తిన తర్వాత సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మే16న ఒక వివరణ జారీ చేశారు. ఒక పనికిమాలిన కేసు విచారణ సందర్భంగా తాను మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను మీడియాలోని ఒక వర్గం వక్రీకరించిందని అన్నారు. ఆ తీరు చదివి తాను బాధపడ్డానని ఆయన చెప్పారు. ''ఒక పనికిమాలిన కేసు విచారణ సందర్భంగా నేను చేసిన మౌఖిక వ్యాఖ్యలను మీడియాలోని ఒక వర్గం వక్రీకరించిన తీరు చదివి నేను బాధపడ్డాను. నకిలీ, బూటకపు డిగ్రీల సహాయంతో బార్ (న్యాయవాద వృత్తి) వంటి వృత్తులలోకి ప్రవేశించిన వారిని నేను ప్రత్యేకంగా విమర్శించాను. అలాంటి వ్యక్తులే మీడియా, సోషల్ మీడియా, ఇతర ఉన్నత వృత్తులలోకి కూడా చొరబడ్డారు, అందువల్ల వారు పరాన్నజీవుల వంటివారు'' అని ఆయన తెలిపారు.

''నేను మన దేశ యువతను విమర్శించానని చెప్పడం పూర్తిగా నిరాధారమైనది. మన ప్రస్తుత, భవిష్యత్ మానవ వనరుల పట్ల నేను గర్వపడటమే కాకుండా... భారతదేశంలోని ప్రతి యువకుడు నాకు స్ఫూర్తినిస్తాడు. భారత యువతకు నా పట్ల గొప్ప గౌరవం, మర్యాద ఉన్నాయని చెప్పడం అతిశయోక్తి కాదు. నేను కూడా వారిని అభివృద్ధి చెందిన భారతదేశానికి మూలస్తంభాలుగా చూస్తాను'' అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu