Dailyhunt
కేరళలో యూడీఎఫ్ ఘన విజయం... కాంగ్రెస్‌లో జోష్, సీఎం రేస్‌లో ఉన్నది వీరే?

కేరళలో యూడీఎఫ్ ఘన విజయం... కాంగ్రెస్‌లో జోష్, సీఎం రేస్‌లో ఉన్నది వీరే?

Times Now Telugu 1 week ago

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించింది. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు యూడీఎఫ్ కూటమి 102 చోట్ల విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతుంది.

ఇక, సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ కూటమి 35 స్థానాలకు పరిమితమై... అధికారం కోల్పోయింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరిచిన బీజేపీ... మూడు చోట్ల విజయం నమోదు చేసింది. అయితే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి విజయంతో కాంగ్రెస్‌ పార్టీలో జోష్ నెలకొంది. దీంతో దక్షిణాదిన ఐదు రాష్ట్రాల్లో... ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో (కర్ణాటక, తెలంగాణ తర్వాత ఇప్పుడు కేరళలో) కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండనున్నాయి.

అయితే కేరళలో యూడీఎఫ్ కూటమి విజయంతో కాంగ్రెస్ నుంచి సీఎం ఎవరు కానున్నారనే చర్చ సాగుతుంది. అయితే కేరళ నూతన సీఎం రేసులో ముగ్గురు కాంగ్రెస్ నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్, కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రమేష్ చెన్నింతల ఉన్నారు. అయితే ఈ ముగ్గురు నాయకులు ''నాయర్'' సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. నాయర్ సామాజిక వర్గం... కేరళ జనాభాలో సుమారు 12 శాతం వాటాను కలిగి ఉంది.

వేణుగోపాల్ (63) విషయానికి వస్తే... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలను చక్కబెట్టడంలో కేసీ వేణుగోపాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసంతృప్త నాయకులను బుజ్జగించడంలోనూ, పార్టీని ఐక్యంగా ఉంచడంలోనూ వేణుగోపాల్ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే కేసీ వేణుగోపాల్ పేరు సీఎం రేసులో వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన పనితీరుపై విమర్శలు కూడా ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం కేసీ వేణుగోపాల్... లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాతీయ స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న కేసీ వేణుగోపాల్... తిరిగి కేరళ రాజకీయాల్లోకి వస్తారా? అనేది అనుమానమే అని చెప్పాలి. ఇక, కేసీ వేణుగోపాల్ తిరిగి కేరళకు వస్తే... కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో అనివార్యంగా కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది.

వీడీ సతీషన్ (62)... కేరళ ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే ముఖ్యమంత్రి పదవికి ఆయన ఫ్రంట్ రన్నర్ అనే విశ్లేషణలు వినపిస్తున్నాయి. గత ఐదేళ్లుగా, అలాగే ఎన్నికల సమయంలోనూ... ప్రతిపక్ష నాయకుడిగా సతీశన్ కీలకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి విజయన్‌కు వ్యతిరేకంగా యూడీఎఫ్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. సతీషన్ తన దూకుడు స్వభావంతో యువతలో గణనీయమైన ప్రజాదరణను సంపాదించుకున్నారు. అలాగే, నిర్భయంగా మాట్లాడే నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అయితే నాయర్ సామాజిక వర్గంలో రమేష్ చెన్నింతలకు సతీషన్ కంటే ఎక్కువ ప్రజాదరణ ఉందనే భావన ఉంది. ఇది సతీషన్‌కు మైనస్ పాయింట్.

రమేష్ చెన్నితాల (70)... రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులలో అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్నారు. పరిపాలన, పార్టీ సంస్థాగత నిర్వహణలోనూ ఆయనకు అపారమైన అనుభవం ఉంది. అంతేకాకుండా, కేరళలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమిలో భాగస్వామ్య పక్షాలు రమేష్ చెన్నితాల పూర్తి విశ్వాసం ఉంచాయి. ఇటీవలి ఎన్నికలలో కాంగ్రెస్ ప్రచార కమిటీకి నాయకత్వం వహించే బాధ్యతను ఆయనకే అప్పగించారు. అయితే రమేష్ చెన్నితాలకు ఆయన వయసు మైనస్‌ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం ప్రకారం... పార్టీ అధిష్టానం నియమించిన పరిశీలకులు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో సంప్రదింపులు జరిపుతారు. తమ నివేదికను కేంద్ర నాయకత్వానికి సమర్పిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ప్రభుత్వాన్ని దృఢంగా, ఎటువంటి వివాదాలకు తావులేకుండా నడిపించగల సమర్థుడైన నాయకుడికి అధికార పగ్గాలను అప్పగించడానికి కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉంది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu