Dailyhunt
మాపై బాధ్యత మరింతగా పెరిగింది...: సీఎం రేవంత్ రెడ్డి

మాపై బాధ్యత మరింతగా పెరిగింది...: సీఎం రేవంత్ రెడ్డి

Times Now Telugu 1 week ago

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రమంతటా గ్రామ సభలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు కీలక సందేశం అందించారు.

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం (కాంగ్రెస్ ప్రభుత్వం) బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాల మూడునెలలు పూర్తయ్యిందని... రాష్ట్రంలోని ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ, గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.

తాము పాలకులం కాదని... సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజా పాలనకు ప్రజలు ఆమోదం, మద్ధతు ప్రకటించారని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ ఫలితాలు తమ బాధ్యతను మరింత పెంచాయని అన్నారు.

ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదని... ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది తమ సంకల్పం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ ఉద్దేశంతోనే ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. మార్చి 6 నుండి 99 రోజుల పాటు... గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగుతోందని తెలిపారు.

ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని సూచించారు.

మహాలక్ష్మి - ఉచిత బస్సు సౌకర్యం, రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ళు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

''తెలంగాణ రైజింగ్ - 2047'' విజన్‌తో ఆర్థికంగానే కాకుండా, అన్నీ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నంబర్ వన్‌గా నిలపాలనేది తమ సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పేర్కొన్నారు. రేర్, ప్యూర్, రేర్‌గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నామని తెలిపారు. వాటి పరిధిలో సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలని చెప్పారు.

ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదని... ఒక దీక్ష అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై... దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలని... ఇదే తన కల అని... ఆ కలను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఇందుకు అందరి సహకారాన్ని కోరుకుంటున్నానని తెలిపారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu