Dailyhunt
మే చివరి నాటికి డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు కేటాయింపు పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మే చివరి నాటికి డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు కేటాయింపు పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Times Now Telugu 1 week ago

రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు ఏస్థాయిలో కూడా ఉన్నా కూడా మే నెల చివరి నాటికి లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.

నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ఇండ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గురువారం నాడు హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఇన్‌చార్జి మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో హౌసింగ్ రెవెన్యూ, ఫారెస్టు అధికారాలతో రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేయడానికి ఇంతవరకు ఖర్చు చేసిన మొత్తాన్ని మినహాయించి , తదుపరి అవసరమైన వ్యయాన్ని ఐదు లక్షల లోపు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందచేస్తామని వెల్లడించారు. అసంపూర్తిగా ఉన్న 2 బిహెచ్ కె లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో లబ్దిదారులే నిర్మించుకునేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ఇండ్ల నిర్మాణాలకు గ్రీన్ ఛానల్‌లో నిధులు విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

డబుల్ బెడ్‌రూం ఇండ్ల కోసం రూ.400 కోట్లు

అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేయాలని , విద్యుత్, మంచినీటి, డ్రైనేజి , రోడ్లు వంటి కనీస వసతులు కల్పించాలని చాలా ఇండ్లలో అనర్హులు ఉన్నారని...వారిని తొలగించి అర్హులకు ఇవ్వాలని సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే అనర్హులను తొలగించే చర్యలు చేపట్టాలని...అర్హులకు కేటాయించాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఇందులో ఎమ్మెల్యేలను భాగస్వామ్యులను చేయాలని సూచించారు. రూ.400 కోట్లతో 2 బిహెచ్ కె కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు తీసుకుని అక్కడ నివసించని వారి ఇండ్లను రద్దు చేసి, అర్హులైన ఇతరులకు వాటిని మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

అక్రమాలకు పాల్పడితే విధుల నుంచి తొలగింపు
డబుల్ బెడ్‌రూం ఇండ్ల బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడితే సస్పెండ్‌తో సరిపెట్టనని సర్వీసు నుంచి తొలగించడానికి కూడా వెనకాడబోమని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పేదవారి సొంత ఇంటి కలను నిజం చేసేలా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని...ఎల్-1, ఎల్-2, ఎల్-3 దరఖాస్తు ఇప్పుడు చేశారు....అప్పుడు చేశారనేది ముఖ్యం కాదనీ పేదరికమే అర్హతని, అర్హులైన వారికి ఇండ్లను ఇవ్వడమే కలెక్టర్ల బాధ్యత అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మొదటి విడతలో వివిధ కారణాలతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోని వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

ఇంటి నిర్మాణానికి 40 టన్నుల ఇసుక ఫ్రీ
పేదవాడికి సహాయం అందించాలన్న సదుద్ధేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి నిర్మాణానికి అవసరమైన 40 టన్నుల ఇసుకను ఉచితంగా అందచేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అయితే లబ్దిదారుల ముసుగులో అక్కడక్కడా దుర్వినియోగం అవుతున్నదన్న సమాచారం ఉన్నదని...ఈ నేపథ్యంలో అర్హులకు ఇసుక అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ఆచరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ఒక పాలసీని రూపొందించాలని సూచించారు నగరానికి దూరంగా 2బిహెచ్ కె కాలనీలను నిర్మించడం వల్ల లబ్ధిదారులు అక్కడ నివసించడానికి ఇష్టపడటం లేదని, అక్కడ నివసిస్తే తమ జీవనోపాథికి ఇబ్బందికి కలుగుతుందని లబ్దిదారులు వెళ్లడం లేదు. తీసుకున్న ఇండ్లను అద్దెకి ఇచ్చి నగరంలోనే ఉంటున్నారు. ఇలాంటి వారిని గుర్తించి, వారి స్థానంలో, ఆయా కాలనీలకు సమీపంలో నివసించే వారికి కేటాయించలన్న ఆలోచన చేస్తున్నాము. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాం'అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu