తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ విక్రయాలు మే నెలలో రికార్డు సృష్టించాయి. ఈ ఏడాది మే నెలలో మొత్తం 1,21,35,528 లడ్డూలను టీటీడీ విక్రయించింది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయని టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని కూడా విస్తృతంగా పెంచి, ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అందిస్తున్నట్టుగా పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో మొత్తం 1,21,35,528 లడ్డూలు విక్రయించామని... గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయని తెలిపింది.
2024 మే నెలలో 1.01 కోట్ల లడ్డూలను భక్తులు కొనుగోలు చేయగా... 2025లో ఆ సంఖ్య 1.10 కోట్లకు పెరిగిందని టీటీడీ తెలిపింది. ప్రస్తుతం 2026లో 1.21 కోట్లకు పైగా లడ్డూ విక్రయాలు నమోదవ్వడం విశేషమని తెలిపింది.
రోజుకు 4 లక్షలకుపైగా లడ్డూల తయారీ...
తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా టీటీడీ తెలిపింది. రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూలను తయారు చేస్తున్నట్టుగా పేర్కొంది. సాధారణ రోజుల్లో 4 లక్షల నుంచి 4.5 లక్షల వరకు లడ్డూలు తయారవుతుండగా, ప్రత్యేక సందర్భాల్లో ఉత్పత్తిని మరింత పెంచుతున్నట్టుగా పేర్కొంది.
లడ్డూ తయారీకి రోజుకు 68 టన్నుల ముడి పదార్థాల వినియోగం...
అత్యంత పవిత్రమైన శ్రీవారి ప్రసాదమైన లడ్డూల తయారీ కోసం రోజువారీగా 68 టన్నులకు పైగా ముడి పదార్థాలను వినియోగిస్తున్నట్టుగా టీటీడీ తెలిపింది. లడ్డూ తయారీకి రోజుకు సుమారు 32 టన్నుల చక్కెర, 16 టన్నుల శనగపిండి, 16 టన్నుల నెయ్యి, 3.5 టన్నుల జీడిపప్పు, 2 టన్నుల ఎండుద్రాక్ష, 400 కిలోల యాలకులు, 800 కిలోల కలకండ వినియోగిస్తున్నామని పేర్కొంది. ఒక్క చిన్న లడ్డూ తయారీకి సగటున 167 నుంచి 170 గ్రాముల ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నామని తెలిపింది. ఇందులో సుమారు 78 గ్రాముల చక్కెర, 39 గ్రాముల శనగపిండి, 36 గ్రాముల నెయ్యి, 7 గ్రాముల జీడిపప్పు, 3 గ్రాముల ఎండుద్రాక్ష తదితర పదార్థాలు ఉంటాయని వివరించింది.
జీఐ గుర్తింపు - ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ''తిరుపతి లడ్డూ''కు భారత ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపును మంజూరు చేసింది. అదేవిధంగా లడ్డూ తయారీ, విక్రయాలకు సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ కూడా టీటీడీకి లభించింది. దీంతో శ్రీవారి లడ్డూ నాణ్యత, ప్రామాణికత మరింత బలోపేతమైంది.
అత్యాధునిక సాంకేతికతతో నాణ్యత నియంత్రణ...
ప్రసాదాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల్లో ఎలాంటి మలినాలు లేకుండా చూసేందుకు శ్రీవారి పోటులో రెండు అత్యాధునిక ఏఐ ఆధారిత కలర్ సార్టింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ముడి పదార్థాల్లోని మలినాలను తొలగించి అత్యుత్తమ నాణ్యత గల ముడి సరుకులను మాత్రమే వినియోగిస్తున్నారు. అలాగే పోటు విభాగానికి అవసరమైన అన్ని ముడి సరుకులను కొనుగోలు విభాగం సేకరించి, ప్రయోగశాల పరీక్షలు నిర్వహించిన అనంతరమే వినియోగానికి అనుమతిస్తోంది.
సంప్రదాయ దిట్టం ప్రకారమే తయారీ...
తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో 1950, 1951 సంవత్సరాల్లో టీటీడీ ఆమోదించిన సంప్రదాయ "దిట్టం" ప్రమాణాలను నేటికీ ఖచ్చితంగా పాటిస్తున్నారు. నిత్య, వార, పక్ష, మాస, నక్షత్ర, సాలకట్ల ఉత్సవాలకు అనుగుణంగా సుమారు 20 రకాల అన్నప్రసాదాలు, 25 రకాల పణ్యారాలను సిద్ధం చేస్తున్నారు. శ్రీవారి పోటులో రెండు షిఫ్టుల్లో సుమారు 700 మంది శ్రీవైష్ణవ బ్రాహ్మణులు భక్తి శ్రద్ధలతో 24 గంటలూ సేవలందిస్తూ లడ్డూ ప్రసాదాల తయారీలో పాల్గొంటున్నారు. వీరికి టీటీడీ సిబ్బంది, పర్యవేక్షకులు సహకరిస్తున్నారు.
Read more news like this on telugu.timesnownews.com

