తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. తాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని మమతా బెనర్జీ తెలిపారు.
ఎన్నికల ఫలితాలను చట్టబద్ధమైన ఓటమిగా తాను అంగీకరించబోనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ అక్కడ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది. బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలకు గానూ 207 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మెజారిటీని దక్కించుకున్న బీజేపీ... తృణమూల్ కాంగ్రెస్ యొక్క 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికింది.
దీంతో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామాను గవర్నర్‌కు సమర్పించాల్సి ఉంది. అయితే కోల్‌కతాలో విలేకరుల సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్ ఎన్నికల్లో భారీ ఎత్తున రిగ్గింగ్, ఓటర్ల జాబితాల తారుమారు జరిగిందని ఆరోపించారు. పెద్ద స్థాయిలో హింస చోటుచేసుకుందని అన్నారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని ఆరోపించారు. దాదాపు 100 స్థానాల్లో తమ గెలుపును కాజేశారని సంచలన ఆరోపణలు చేశారు.
తమ పార్టీ కేవలం బీజేపీతోనే కాకుండా మొత్తం వ్యవస్థతో పోరాడుతుందని మమతా బెనర్జీ చెప్పారు. బెంగాల్ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలోనూ భారత ఎన్నికల సంఘం, కేంద్ర బలగాలు పక్షపాతంతో వ్యవహరించాయని కూడా మమతా బెనర్జీ ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణల సమయంలో దాదాపు 90 లక్షల పేర్లను తొలగించారని ఆరోపణలు చేశారు. పలు జిల్లాల్లో టీఎంసీ ఏజెంట్లు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని కేంద్ర బలగాలు బెదిరింపులకు పాల్పడ్డాయని అన్నారు.
ఓటమి ఎదురైనప్పటికీ టీఎంసీ ఐక్యంగానే ఉందని మమతా బెనర్జీ తెలిపారు. ఆరోపించిన అవకతవకలపై విచారణ జరిపేందుకు 15 మంది సభ్యులతో ఒక వాస్తవ పరిశీలన కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా టీఎంసీ తమ పోరాటాన్ని కొనసాగిస్తుందని బెనర్జీ తెలిపారు. పార్టీ చెక్కుచెదరలేదని... తాము పోరాడుతూనే ఉంటామని... తిరిగి పుంజుకుంటామని అన్నారు.
ఉద్రిక్తతల మధ్య కౌంటింగ్ కేంద్రానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తుండగా తనపై శారీరకంగా దాడి జరిగిందని మమతా బెనర్జీ ఆరోపించారు. పలు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అంతరాయం కలిగిందని కూడా ఆమె ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజు బెంగాల్ రాజకీయ చరిత్రలో బ్లాక్ డే అని అభివర్ణించారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియలను బలహీనపరిచారని ఆము ఆరోపించారు.
అయితే దేశంలో ప్రతిపక్షాల ఐక్యత కొనసాగుతోందని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, హేమంత్ సోరెన్‌తో సహా పలువురు ఇండి కూటమి నాయకులు తమకు మద్దతు తెలియజేయడానికి ముందుకు వచ్చారని ఆమె తెలిపారు.
ఇక, బెంగాల్ అసెంబ్లీలో మొత్తం 294 స్థానాలకు గానూ టీఎంసీ 80 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 207 సీట్లతో భారీ మెజారిటీ సాధించింది. మమతా బెనర్జీ తాను పోటీ చేసిన భవానిపూర్ నియోజకవర్గంలో ఓటమి చెందడం ఆమెకు వ్యక్తిగతంగా, రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది.
Read more news like this on telugu.timesnownews.com

