ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాస్టర్ అభినయ్ దర్శన్‌పై దాడి ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల లాగే తనను చంపాలని చూస్తున్నారని...
కొందరు వ్యక్తులు తనపై హత్యాయత్నం చేశారని అభినయ్ దర్శన్ ఆరోపించారు. అయితే పాస్టర్ అభినయ్ దర్శన్‌పై దాడి పెద్ద డ్రామా అని పోలీసులు నిర్దారణకు వచ్చారు. కొందరు వ్యక్తులు కారుపై దాడి చేస్తూ పాస్టర్ అభినయ్‌ను చంపేందుకు ప్రయత్నించినట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో డ్రామా అని తేల్చారు. ఇదంతా పాస్టర్ అభినయ్ దర్శన్‌తో పాటు ఆరుగురు కలిసి ఆడిన డ్రామాగా నిర్దారించారు. ఇందుకు సంబంధించి పలు ఆధారాలను సైతం పోలీసులు సేకరించారు.
భరోసా పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే పాడేరులో కడపకు చెందిన అభినయ్ దర్శన్ క్రైస్తవ మత ప్రచారకుడిగా ఉన్నారు. ఇటీవల తనపై కొందరు వ్యక్తులు దాడి చేసి, చంపాలని చూశారని అభినయ్ ఆరోపించారు. తన పాదయాత్రలో భాగంగా నిరుతోటపాలెం ప్రాంతం గుండా ప్రయాణిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తుల అడ్డగించి దాడి చేసినట్టుగా అభినయ్ చెబుతున్నారు. మొదట గుడ్లు విసిరిన దుండగులు... ఆ తర్వాత పదునైన ఆయుధాలతో దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిలో గాయపడ్డ తనను రోడ్డు పక్కన వదిలివెళ్లారని తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే ఇదంతా డ్రామా అని పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. పోలీసు వర్గాల ప్రకారం... అటవీ ప్రాంతంలో కారుపై రాళ్లతో దాడి చేసి పాస్టర్ అభినయ్‌పై హత్యాయత్నం జరిగినట్లుగా నమ్మించేందుకు అతడి బృందం ప్లాన్ చేసింది. ఈ ఘటనలో ఒక నిందితుని భార్య సోషల్ మీడియా ఖాతా ద్వారా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇందులో నటించినందుకు కొందరికి డబ్బులు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఎక్కడ దాడి చేయాలి... ఎలా దాడి చేయాలి... ఎలా సీన్ క్రియేట్ చేయాలి అనేది నిందితుల ఆడియో మెసేజ్ ద్వారా వెల్లడయ్యాయి. పాస్టర్ అభినయ్‌పై దాడి అంటూ ప్రచారం వెనుక ఉన్న కుట్ర, ఘటన వెనుక ఎవరున్నారు అనే విషయాలు వెలికి తీస్తు న్నారు. గాయాలు కాకపోయినా హత్యాయత్నం అంటూ చిన్న గాయం చేసుకుని చేసిన డ్రామాను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. కారులో వచ్చిన ముగ్గురు, దాడి చేసినట్లు నటించిన మరో ముగ్గురుని ప్రశ్నిస్తున్నారు. మొత్తం డ్రామా వెనుక ఎవరెవరు ఉన్నారు... వీరి ప్రధాన లక్ష్యం ఏమిటి... వారికి సహకరించింది ఎవరు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. సమాజంలో అపోహలు సృష్టించి, వివిధ మతాల మధ్య వైషమ్యాలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు పాస్టర్ అభినయ్ దర్శన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇక, అభినయ్ దర్శన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... పోలీసులు దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని అన్నారు. తనపై దాడి చేసిన వారిని వదిలేసి, తన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆరోపణలు చేశారు. తనపై తానే దాడి చేసుకున్నట్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రవీణ్ పగడాలపై వేసినట్టుగానే తనపై నిందలు వేస్తున్నారని ఆరోపణలు చేశారు. దాడులకు నేను భయపడనని... ప్రజల సమస్యలపై ప్రభుత్వాధికారులను ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపారు.
Read more news like this on telugu.timesnownews.com

