పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్, అమెరికా యుద్ధం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడింది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను ప్రకటించారు. ఈ విషయాన్ని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
వివిధ దేశాలు హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన తమ నౌకలను సురక్షితంగా తీసుకురావాలని అమెరికా సహాయాన్ని కోరినట్లు ట్రంప్, ట్రూత్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధంలో భాగస్వామ్యం కాని దేశాలన్నీ హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయాయని, వాటిని విడిపించేందుకు ఆ దేశాలు అమెరికా సాయాన్ని కోరాయని తెలిపారు. ఆయా దేశాల అభ్యర్థన మేరకు హర్మూజ్ జలసంధి నుండి నౌకలను సురక్షితంగా బయటపడేందుకు సాయం చేయనున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ సోమవారం నుండి ప్రారంభం కానుంది.
ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌లో భాగంగా, ఒక సారి నౌక హర్మూజ్ జలసంధి నుండి సురక్షితంగా బయటపడిన తర్వాత, సాధారణ పరిస్థితులు ఏర్పడేంత వరకు మళ్లీ ఆప్రాంతానికి వెళ్లదని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను ట్రంప్, మానవతా చర్యగా భావించారు. తాము తలపెట్టిన
ఈ ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు ఎదురైనా, బలప్రయోగంతో ఎదుర్కొంటామని హెచ్చరించారు. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ విషయమై ఇరాన్‌తో తమ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.
ఇరాన్, అమెరికా మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.అమెరికా యుద్ద నౌకపై ఇరాన్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అమెరికా ఈ విషయాన్ని ఖండించింది.
హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలను బయటకు తీసుకురావడానికి అమెరికా సైన్యం సహాయం చేస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటు చేసుకుంది. హర్మూజ్ జలసంధిలోకి అమెరికా నౌకాదళ డిస్ట్రాయర్‌ను ప్రవేశించకుండా ఒక తాము అడ్డుకున్నామని ఇరాన్ సైన్యం పేర్కొంది.
రవాణా, నౌకా భద్రత నిబంధనలను ఉల్లంఘించి హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఒక నౌకపై రెండు క్షిపణులతో దాడి జరిగిందని ఫార్స్ వార్తా సంస్థ పేర్కొంది. అయితే ఈ విషయాన్ని వాదనను అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ఖండించింది.
హర్మూజ్ జలసంధి ఇరాన్, ఓమన్ దేశాల మధ్య ఉంది. పర్షియన్ గల్ఫ్‌ను గల్ఫ్ ఆఫ్ ఓమన్, అరేబియా సముద్రాన్ని కలిపే ఈ జలసంధి, ప్రపంచ వాణిజ్యంలో ఎంతో కీలకమైనది. గ్లోబల్‌గా జరిగే చమురు సరఫరాలో ఐదో వంతు, సుమారుగా 21 మిలియన్ బ్యారెల్స్ ఈ జలసంధి మార్గం ద్వారానే రవాణా జరుగుతుంది. ప్రపంచ దేశాల చమురు వినియోగంలో సుమారు 20 శాతం, అంటే రోజుకు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు , ఇంధనం హర్మూజ్ ద్వారా రవాణా జరుగుతుంది. అయితే, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG)లో నాలుగో వంతు లేదా అంతకంటే ఎక్కువ భాగం కూడా ఈ మార్గం గుండానే వెళుతుంది.

