'జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన నాయకత్వాన్ని గుర్తించి ప్రోత్సహించే దిశగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కసరత్తు చేపట్టడం జరిగింది.
25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా 'జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలు'ఏర్పాటు చేయాలని నిర్ణయించాను'అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.'పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకులు, సాధకులు, జనసైనికులను గుర్తించి వారి వివరాలను సేకరించడం ఈ కమిటీల ప్రధాన ఉద్దేశం. సాధారణంగా రాజకీయ పార్టీల్లో నాయకత్వం పైస్థాయి నుంచి కిందిస్థాయికి నిర్ణయించబడుతుంది. అయితే జనసేన పార్టీ కేడర్ ఆధారిత వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో, క్షేత్రస్థాయి కార్యకర్తల పనితీరు, సేవలు, నాయకత్వ లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించాం'అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలు
'ఇటీవల నిర్వహించిన 'సేనతో సేనాని' కార్యక్రమం ద్వారా పార్టీకి వివిధ విభాగాల్లో సేవలందించాలనే ఆసక్తి, అంకితభావం కనబరిచిన ఔత్సాహిక జనసైనికులను గుర్తించి, వారిలో కొందరికి ఈ పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల రూపకల్పన ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించడం జరిగింది' జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.'అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పనిచేసిన సాధకులు, పార్టీ స్థాపనకు ముందునుంచి అలాగే 2009 నుంచి నాతో కలిసి పయనిస్తూ జనసేన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీలను రూపొందించాం'అని డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
28 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు
'ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 28 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశాం. ఇందులో ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న ముగ్గురు సాధకులు కలిపి 7 మంది ప్రధాన సభ్యులతో పాటు, వారితో సమన్వయం చేస్తూ పనిచేసే 21 మంది సాధకులను నియమించాం'అని జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 'ప్రతి కమిటీకి పరిశీలకులుగా సీనియర్ నాయకులను నియమించాం. అలాగే ఈ కమిటీలలో మహిళలకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించాం. ఈ కమిటీల్లో ఉన్న సభ్యులకు ఎటువంటి నాయకత్వ నియామకాలు చేపట్టే లేదా నాయకత్వాన్ని నిర్ణయించే అధికారం ఇవ్వలేదు. వారి బాధ్యత కేవలం ఔత్సాహిక నాయకులు, సాధకులు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జనసైనికుల వివరాలను సేకరించి, వాటిని నా పరిశీలనకు సమర్పించడం మాత్రమే. సేకరించిన సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించి, పార్టీ ముఖ్య నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయాన్ని నేను స్వయంగా తీసుకుంటాను'అని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు.
అంకిత భావంతో పనిచేసిన జనసైనికులకు గుర్తింపు
కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా జనసేన పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది అని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.'జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయి సమాచారాన్ని పరిశీలించి పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకోనుంది. జనసేన పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన జనసైనికులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దశాబ్దన్నర క్రితమే రూపుదిద్దుకున్న జనసేనాని ఆలోచనకు కార్యరూపంగా ఈ కమిటీలు నియమించాం'అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Read more news like this on telugu.timesnownews.com

