Dailyhunt
పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్‌లలో ఏ స్థానానికి విజయ్ రాజీనామా చేస్తారు?... అక్కడ టీవీకే నుంచి బరిలో నిలిచేది ఎవరు?

పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్‌లలో ఏ స్థానానికి విజయ్ రాజీనామా చేస్తారు?... అక్కడ టీవీకే నుంచి బరిలో నిలిచేది ఎవరు?

Times Now Telugu 1 week ago

మిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిన టీవీకే...

అందుకు కావాల్సిన మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాకుండా తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్ర గవర్నర్‌కు టీఎంకే లేఖ కూడా రాసింది. ఇదిలాఉంటే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఇప్పుడు అందులో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంది. అయితే విజయ్ ఏ స్థానాన్ని వదులుకుంటారు?, అక్కడ జరిగే ఉప ఎన్నికలో టీవీకే అభ్యర్థిగా ఎవరిని నిలుపుతారానేది చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...

విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ నుంచి పోటీ చేసి, రెండు చోట్ల గెలుపొందారు. తిరుచ్చి ఈస్ట్‌లో డీఎంకేకు చెందిన ఇనిగో ఇరుదయరాజ్‌ను 27,416 ఓట్ల తేడాతో ఓడించారు. ఇక, పెరంబూర్‌లో విజయ్... డీఎంకే అభ్యర్థి అయిన ఆర్‌డీ శేఖర్‌ను 53,715 ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారు. విజయ్ రెండు స్థానాల నుంచి విజయం సాధించినందున... ఒక్క స్థానాన్ని వదులుకోవాల్సి ఉంది. టీవీకే వర్గాల ప్రకారం... విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసే అవకాశం ఉంది. అయితే అక్కడ విజయ్ అక్కడి నుంచి ఎవరిని బరిలో నిలుపుతారు? అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించిన పలు రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం... తిరుచ్చి ఈస్ట్‌ నుంచి సీనియర్ నేత కు పా కృష్ణన్‌ను టీవీకే తరఫున బరిలో నిలిపే అవకాశం ఉంది. కు పా కృష్ణన్ ఇటీవలి ఎన్నికల్లో లాల్గుడి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే అక్కడి నుంచి అన్నాడీఎంకే అభ్యర్థి, లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ భార్య లీమా రోజ్ మార్టిన్‌ విజయం సాధించారు.

అయితే లాల్గుడి నుంచి ఓడిన కు పా కృష్ణన్‌ను తిరుచ్చి ఈస్ట్‌ నుంచి ఉప ఎన్నికలో బరిలో నిలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. కు పా కృష్ణన్ విషయానికి వస్తే... ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 1991 నుంచి 1996 మధ్యకాలంలో జె జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలందించారు. అయితే అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన కృష్ణన్... 'తమిళర్ భూమి' అనే పేరుతో తన సొంత రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ పార్టీని రద్దు చేసిన అనంతరం ఆయన తిరిగి అన్నాడీఎంకేలో చేరారు. ఆ తర్వాత మళ్లీ అన్నాడీఎంకే నుంచి కూడా బయటకు వచ్చారు. చివరకు కృష్ణన్... తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు టీవీకేలో చేరారు.

మే 7న తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?...
ఇదిలాఉంటే, విజయ్ మంగళవారం రోజున టీవీకే ప్రధాన కార్యాలయంలో ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీవీకే ఎమ్మెల్యేలు విజయ్‌ను తమ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. మరోవైపు తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ కార్యాలయానికి విజయ్‌ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండు వారాల్లో అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకుంటామని తెలిపారు. ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ గురువారం చెన్నైకి చేరుకోనున్నారు. ఆ తర్వాత ఆయనను విజయ్ బృందం కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకార తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అన్ని అనుకున్నట్టుగా జరిగితే విజయ్ గురువారం (మే 7) రోజున తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇందుకు సంబంధించి అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu