Dailyhunt
రాజ్యసభ గ్యాలరీలోని టీడీపీ నేతలను ఎలా టెలికాస్ట్‌లో చూపెడతారు? : వైవీ సుబ్బారెడ్డి

రాజ్యసభ గ్యాలరీలోని టీడీపీ నేతలను ఎలా టెలికాస్ట్‌లో చూపెడతారు? : వైవీ సుబ్బారెడ్డి

Times Now Telugu 1 week ago

రాజ్యసభ గ్యాలరీలో కూర్చొన్న టీడీపీ నేతల దృశ్యాలను టీవీల్లో టెలికాస్ట్ చేయడంపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ఆ పార్టీ ప్రతినిధి బృందం శుక్రవారం రోజున ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కలిసింది.

ఈ బృందంలో వైసీపీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, గురుమూర్తి, గొల్ల బాబురావు ఉన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సమస్యలు, రాష్ట్ర అభివృద్ది అంశాలు, కేంద్ర సహకారంతో పాటు పలు అంశాలను ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా వైసీపీ వర్గాలు తెలిపారు. అలాగే, అమరావతి చట్టబద్దత కల్పించే ఏపీ పునర్విభజన సవరణ బిల్లు, 2026పై రాజ్యసభలో చర్చ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను సైతం వైసీపీ ఎంపీలు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది.

అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదన్నారు. అమరావతికి సంబంధించి ప్రస్తుత బిల్లుకు మాత్రమే వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. రాజ్యసభలో అమరావతిపై చర్చలో భాగంగా వైసీపీ ఎంపీల గొంతు నొక్కారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ, అవినీతి జరుగుతోందన్నారు.

అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా తమ పార్టీకి తక్కువ సమయం కేటాయించారని ఆరోపించారు. తద్వారా తమ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందని... ఈ విషయాన్ని రాజ్యసభ చైర్మన్‌కి వివరించామమని తెలిపారు. రాజ్యసభలో తమకు ఏడుగురు ఎంపీలు ఉన్నారని... నిబంధనల ప్రకారం తమకు 20 నిమిషాల సమయం ఇవ్వాలని అన్నారు. అయితే తమకు రాజ్యసభలో 5 నిమిషాలు సమయం ఇచ్చి మైక్ కట్ చేశారని చెప్పారు. రాజ్యసభలో వైసీపీ కన్నా తక్కువ సభ్యులు ఉన్నటువంటి బీఆర్‌ఎస్‌, టీడీపీలకు ఎక్కువ సమయం ఇచ్చారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలకు ఒక్కొక్కరికి 10 నిమిషాలు సమయం ఇచ్చారని తెలిపారు.

అయితే ఈ విషయాలను ఉప రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. తాము చెప్పిన అంశాలను ఉపరాష్ట్రపతి సానుకూలంగా విన్నారని... రాజ్యసభలో మాట్లాడుకుండా అడ్డుకోవడం వల్ల మిగిలిపోయిన తమ ప్రసంగం రికార్డులలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని... పార్లమెంట్‌ ముందుకు తీసుకొచ్చిన బిల్లుకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. రాజధాని రైతుల దగ్గర 50 వేల ఎకరాలు తీసుకున్నారని... ఆ భూములిచ్చిన 29వేల మంది రైతులకు న్యాయం చేయమని తాము అడుగుతున్నామని తెలిపారు. అమరావతి రైతులకు ఏవిధంగా న్యాయం చేస్తారో బిల్లులో పెట్టమని అడిగామని చెప్పారు.

అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ, అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అమరావతిలో స్క్వేర్ ఫీట్‌కు 14 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని... ప్రపంచంలో ఎక్కడా నిర్మాణానికి ఇంత ఖర్చు చేయలేదని అన్నారు. ఇదంతా ప్రజా ధనాన్ని లూటి చేయడమేనని ఆరోపించారు. కోల్‌కతా, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఎన్ని ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టారని ప్రశ్నించారు. తమకు నిబంధనల ప్రకారం సమయం కేటాయించలేదని రాజ్యసభ చైర్మన్‌కు వివరించామని తెలిపారు.

అలాగే రాజ్యసభ గ్యాలరీలో కూర్చొన వారిని టెలికాస్ట్‌లో చూపించడం జరగదని అన్నారు. అయితే నిన్న గ్యాలరీల్లో కూర్చొన్న తెలుగుదేశం పార్టీ నేతలను టెలికాస్ట్‌లో చూపించారని... ఇందుకు సంబంధించి ఈరోజు పేపర్లలో కూడా ఫొటోలు వచ్చాయని తెలిపారు. అయితే ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. ఈ విషయాన్ని కూడా పరిశీలించి చర్యలు తీసుకోమని ఉప రాష్ట్రపతిని కోరామని తెలిపారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu