ఈ ఏడాది మే 15 నుంచే రైతులకు సాగునీరు అందించనున్న దృష్ట్యా రాష్ట్రంలో వేగంగా విత్తన సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖకు దిశానిర్దేశం చేశారు.
విత్తనాల సరఫరా కోసం రూ.200 కోట్లు కేటాయించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో బుధవారం ఆయన రాష్ట్రంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ తదితర పంటల కొనుగోళ్లపై సీఎం వ్యవసాయ, ఉద్యాన శాఖలతో సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షకు మంత్రి కె.అచ్చెన్నాయుడు, వ్యవసాయ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా రైతులు పండించే పంటలకు ధరలు దక్కేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ ద్వారా పంటలకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
మామిడిని ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేసేలా చూడాలి
రైతుకు లాభసాటిగా ఉండేలా నాణ్యమైన పంట దిగుబడులు వచ్చేందుకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. మరిన్ని పంటలను ప్రకృతి సేద్యం విధానంలో వివిధ పంటలను సాగు చేస్తే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. సేంద్రీయ సాగుకు కంపోస్టు ఎరువును సరఫరా చేసేలా చూడాలన్నారు. ఈ ఏడాది 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంట ఉత్పత్తి వస్తుందని అధికారులు వివరించారు. మొక్క జొన్న సహా ఇతర పంటల ద్వారా ఇథనాల్ తయారీకి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. మామిడిని ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేసేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అరటి, ఆయిల్ పామ్, మిర్చి, కోకో లాంటి పంటలకు సంబంధించి ధరల సమస్య లేదని రైతులకు మంచి ధర లభిస్తోందని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించారు.
మదనపల్లె లో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్
సీజన్ కంటే ముందే రాష్ట్రంలోని నీటి వనరుల్లో ఫిష్ సీడ్ ను సరఫరా చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వచ్చే పంట సీజన్ కు 7.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. నాఫెడ్ నుంచి మినుములు ఇతర వాణిజ్య పంటల్ని కొనుగోలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రికి వివరించారు. పీఎండీఎస్ పథకం ద్వారా తక్కువ యూరియా వినియోగానికి ఇచ్చే ప్రోత్సాహకం పై కేంద్రంతో మాట్లాడాలని సీఎం వారికి సూచించారు. మదనపల్లె లో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు కానుందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
సముద్ర తీరప్రాంతాల్లో సీవీడ్ కల్టివేషన్
మరోవైపు రాష్ట్రంలోని సముద్ర నాచు ఉత్పత్తులు, విలువ జోడింపు తదితర అంశాల్లో మహిళలు ఆదాయాన్ని ఆర్జించేందుకు వీలుగా ఓ ఎకనామిక్ మోడల్ ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతాల్లో సీవీడ్ ఫార్మింగ్ తో స్వయం సహాయ సంఘాల మహిళలు, మత్య్సకారులకు అదనపు ఆదాయాల కల్పనపై సీఎం సమీక్ష నిర్వహించారు. సీవీడ్ కల్టివేషన్ ద్వారా ఎస్ హెచ్ జీ మహిళల ఆదాయ మార్గాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచనలు చేశారు. ఏపీలోని సముద్ర తీరప్రాంతాల్లో సీవీడ్ కల్టివేషన్ కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సెంట్రల్ సాల్ట్ మెరైన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తదితర సంస్థల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు వర్చువల్‌గా మాట్లాడారు.
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్
అమృతా విశ్వ విద్యాపీఠంతో కలిసి మహిళలకు సీవీడ్ కల్చర్ సాగుకు సంబంధించిన అంశాలపై ఓ నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. సీవీడ్ ద్వారా వచ్చే ఆదాయంపై ఓ ఎకనామిక్ మోడల్ ను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సుదీర్ఘమైన తీరప్రాంతంలో సముద్ర నాచు సాగు ద్వారా మహిళలకు ఉపాధి కల్పించేలా వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి వచ్చేలా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సీవీడ్ ద్వారా వివిధ ఉత్పత్తులు తయారు చేసేందుకు విలువ జోడించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థలను కూడా సంప్రదించాలన్నారు. మెరైన్ ఉత్పత్తిగా సంపద సృష్టికి సీవీడ్ ఓ కీలకమైన ప్రత్యామ్నాయం అవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఫార్మా సహా, న్యూట్రాసిటికల్ ఉత్పత్తుల్లో ప్రధానమైన ముడిసరుకు గా ఈ సీవీడ్ అంతర్జాతీయ మార్కెట్ ను అందుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.
Read more news like this on telugu.timesnownews.com

