తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో గోదావరి త్రివేణి సంగమం వద్ద సరస్వతి అంత్య పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
గురువారం తెల్లవారుజామున 5.43 నిమిషాలకు కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి పుష్కర స్నానం చేసి సరస్వతి అంత్యపుష్కరాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ పూజల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. సరస్వతి అంత్య పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నేటి నుంచి జూన్ 1వ తేదీ వరకు సరస్వతి అంత్యపుష్కరాలు జరగనున్నాయి. ఈ పుష్కరాలు జరిగే 12 రోజులు పూజలు, హోమాలు... సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సరస్వతి అంత్యక్రియలు మే 21న మహా గణపతి హోమం నుంచి ప్రారంభం కాగా... జూన్ 1న లఘు చండి మహా పూర్ణాహుతితో ముగుస్తాయని పండితులు తెలిపారు. ఈ పుష్కరాల్లో భాగంగా ప్రతిరోజూ ఒక ప్రముఖ పీఠం స్వామిజీ నదిలో పుణ్య స్నానం ఆచరించనున్నారు. సరస్వతి అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది.
సరస్వతి అంత్యపుష్కరాల ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.30.63 కోట్ల నిధులను కేటాయించింది. గత ఏడాది సరస్వతి ఆది పుష్కరాల సందర్భంగా జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. నడక దారిలో మ్యాట్లు, క్యూ లైన్లపై చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లను సైతం అందుబాటులో ఉంచారు.
సరస్వతి అంత్యపుష్కరాల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరంకు 3,360 బసులను ఏర్పాటు చేశారు. సరస్వతి అంత్యపుష్కరాలకు దాదాపు 30 నుంచి 40 లక్షల మంది ప్రజలు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇక, పవిత్ర సరస్వతి అంత్య పుష్కర మహోత్సవం సందర్భంగా భక్తులందరికీ సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులు కాళేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి, దైవానుగ్రహం పొందాలని ఆకాంక్షించారు. ఈరోజు నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న అంత్య పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సమగ్రంగా పూర్తి చేసిందని పేర్కొన్నారు. అంత్యపుష్కరాలకు తరలివచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున భక్తులు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా జరగాలని అభిలషించారు.
Read more news like this on telugu.timesnownews.com

