తెలంగాణలో విభిన్న వాతావరణం కొనసాగుతుంది. రాష్ట్రంలో ఓ వైపు ఎండల తీవ్రత కొనసాగుతుంటే... మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. అయితే చాలా ప్రాంతాల్లో గత మూడు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
అయితే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈరోజు (జూన్ 4)న ఈదురుగాలలతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే వాతావరణ శాఖ ఏయే జిల్లాలకు అలర్ట్ జారీ చేసిందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
గురువారం (జూన్ 4) రోజున రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 50 నుంచి 60 కి.మీ) కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇక, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 40 నుంచి 50 కి.మీ) కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇదిలాఉంటే, రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ప్రస్తుతం పశ్చిమ ఉత్తరప్రదేశ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
నైరుతి రుతుపవనాలు...
నైరుతి రుతుపవనాలు ఈరోజు భారత ప్రధాన భూభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు జూన్ 4వ తేదీన కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్ర, లక్షద్వీప్ దీవులు, కేరళలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను ఒకేసారి నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత ఉత్తరం దిశగా కదులుతాయి. ఈ క్రమంలోనే కేరళ తీరాన్ని తాకిన ఐదు నుంచి ఏడు రోజుల వరకు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read more news like this on telugu.timesnownews.com

