ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO) దారా ఖోస్రోషాహి మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మెట్రో ప్రయాణం అద్భుతంగా ఉందంటూ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీ మెట్రోలో జరిగిన తన ప్రయాణ అనుభవాన్ని మొత్త వీడియో తీసి ఎక్స్, లింక్‌డిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఖోస్రోషాహి మెట్రోలో ఢిల్లీ సెక్రటేరియట్ నుండి జోర్ భాగ్ వరకు బ్లూ లైన్‌లో ప్రయాణించారు. మోడీ జాకెట్ ధరించి, ఢిల్లీ మెట్రోలో సాధారణ వ్యక్తిలా ప్రయాణం చేశారు. స్టేషన్‌లో, కోచ్‌లో నడుస్తూ కనిపించారు. ఈ సందర్భంగా ఢిల్లీ మెట్రో సేవలను కొనియాడారు. "మెట్రో ప్రయాణం వేగవంతమైనది, చౌకైనది , అత్యంత నమ్మదగినది" అని ఆయన తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఆయన మెట్రో టికెట్స్‌ను ఊబర్ యాప్ ద్వారా బుక్ చేశారు. క్యూఆర్ కోడ్ సహాయంతో మెట్రోల్ ప్రయాణం చేశారు. ఈ సర్వీస్, ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC)తో ఉబర్ అనుసంధానం ద్వారా పనిచేస్తుంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కూడా తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.
ఇటీవల ఢిల్లీలో ఒక రోజంతా గడిపి, Uber యాప్ ద్వారానే బుక్ చేసుకున్న మెట్రో రైడ్‌లో ప్రయాణించానని ఉబర్ సీఈఓ ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఇండియాలో ఉబర్ ద్వారా కోటికి పైగా మెట్రో రైడ్‌లు బుక్ అయ్యాయంటే, ప్రయాణికులు దీన్ని ఎంతగానో ఇష్టపడుతున్నారని స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో ఉబర్ సీఈఓ భేటీ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO) దారా ఖోస్రోషాహి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది.ఈ సందర్భంగా ఉబర్ సంస్థ కార్యకలాపాలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. హైదరాబాద్‌లో ఉన్న ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా దేశం వెలుపల ఏర్పాటు చేసిన తొలి ఎక్సలెన్స్ సెంటర్ ఇదేనని, ఇక్కడ 600 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నట్లు తెలిపారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో పార్కింగ్ సమస్య పెరిగిందని, ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి సారించాలని ఉబర్ సంస్థకు ఆయన సూచించారు. మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ఇటీవల ఉబర్ గ్లోబర్ లీడర్‌షిప్ టీమ్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ వివరాలను మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా వెల్లించారు. ఉబర్ సీఈవో దారా ఖోస్రోషాహి(Dara Khosrowshahi) నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగినట్లు తెలిపారు. టెక్నాలజీ, మొబిలిటీ, ఇన్నోవేషన్‌పై విస్తృతంగా చర్చలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. స్కిల్లింగ్, అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ భవిష్యత్తు అంశంపై మాట్లాడినట్లు తెలిపారు.

