ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖపట్నాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని, 'సౌత్ కోస్ట్ రైల్వే జోన్'ను ఏర్పాటు చేస్తున్నట్టుగా గెటిజ్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఈ కొత్త రైల్వే జోన్ 2026 జూన్ 1 నుంచి అమల్లోకి రానుందని... ఆరోజు నుంచి రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని తెలిపింది. అదే సమయంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిని కూడా ఈ గెజిట్ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఇక, దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తున్నట్లు గెజిట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఈ కొత్త రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. అయితే ఆయా డివిజన్లలో కీలక మార్పులు చేశారు. ఇక, రాయచూర్-వాడి, విష్ణుపురం-పగిడిపల్లి మార్గాలు సికింద్రాబాద్ డివిజన్‌కు బదిలీ చేశారు. కొండపల్లి-మోతుమర్రి మార్గాన్ని విజయవాడ డివిజన్‌లో చేర్చారు.
ఇక, వాల్టేర్ డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించనున్నారు. ఒక భాగాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో కొత్త రాయగడ డివిజన్‌గా ఏర్పాటు చేస్తుండగా... మిగిలిన భాగాన్ని సౌత్ కోస్ట్ రైల్వేలో ఉంచి విశాఖ డివిజన్‌గా పేరు మార్చనున్నారు. ఇక, పలాసా-ఇచ్ఛాపురం మార్గాన్ని ఖుర్దా రోడ్ డివిజన్ నుంచి విశాఖ డివిజన్‌కు బదిలీ చేశారు. ఇచ్చాపురం - దువ్వాడ- విజయనగరం రైల్వే లైన్‌ను విశాఖ డివిజన్‌లో చేర్చారు. అదే విధంగా నౌపడా- పర్లాకిమిడి- బొబ్బిలి - సాలూరు లైన్లు, సింహాచలం- వడ్లపూడి- విశాఖ జగ్గయ్యపాలెం రైల్వే లైన్లను విశాఖ డివిజన్‌లో విలీనం చేశారు. ఈ మార్పులు అన్ని కూడా జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
కొత్త రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో... ఈ మార్పులతో రైల్వే మార్గాల నిర్వహణ సులభతరం అవుతుందని కేంద్రం పేర్కొంది. అలాగే, ప్రయాణికులకు అందించే సేవల సమన్వయం మెరుగుపడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం దక్షిణ కోస్తా రైల్వే (SCoR) పరిధిని స్పష్టం చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఏపీ ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దరన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టుగా పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కావడం ఏపీ ప్రజల చిరకాల స్వప్నం అని.. సీఎం చంద్రబాబు కృషితోనే ఇది సాకారమైందని అన్నారు. 2026 జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభం కావడంతో.. రాష్ట్ర రవాణా రంగంలో నవశకానికి నాంది పలకనుందని అన్నారు. ఎన్నో ఏళ్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కల నెరవేరుస్తూ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కావడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. కొత్త జోన్ ఏర్పాటుతో రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు, కొత్త రైళ్ల రాక, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Read more news like this on telugu.timesnownews.com

