పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)కు బిగ్ షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడిన సంగతి తెలిసిందే.
అయితే పశ్చిమ బెంగాల్‌లో ఎంఐఎం పోటీ చేసిన 11 స్థానాల్లోనూ ఓడిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంటుంది. పలు రాష్ట్రాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎంఐఎం ఎన్నికల బరిలో నిలుస్తూ వస్తుంది. ఇలా ఒకటి రెండు రాష్ట్రాల్లో ఉనికి చాటుకుంటూ వస్తోంది.
బీహార్‌లో అయితే ఎంఐఎం మంచి ఫలితాలనే రాబట్టుకుంటుంది. గతేడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం మరోసారి తన ఉనికిని చాటుకుంది. ఐదు స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇదే ఊపుతో పశ్చిమ బెంగాల్‌లో కూడా ముస్లిం జనాభా అధికంగా నియోజకవర్గాల్లో పరిమిత స్థానాల్లో బరిలో నిలవాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎంఐఎం బరిలో దిగనున్నట్టుగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో హుమాయున్ కబీన్ నేతృత్వంలోని ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AJUP)తో తమ పార్టీ పొత్తు ఉంటుందని తెలిపారు. అయితే ముస్లిం ఓట్లను చీల్చడానికి హుమాయున్ కబీర్ డబ్బు అడుగుతున్నట్లు ఒక స్టింగ్ ఆపరేషన్ వీడియో బయటకు రావడం కలకలం రేపింది.
దీంతో ఎన్నికలకు ముందు ఏజేయూపీతో చేసుకున్న పొత్తును ఏఐఎంఐఎం తెంచుకుంది. దీంతో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. బీహార్‌లోని 12 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులను నిలిపింది. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్ వంటి మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాలపై దృష్టి సారించిన ఎంఐఎం... జలంగి, డోమ్‌కల్, భరత్‌పూర్, సాగర్‌దిఘి, అసన్‌సోల్ నార్త్, ఇటహార్ వంటి కీలక స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఏ ఒక్క స్థానంలో కూడా ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు.
దీంతో బెంగాల్ అసెంబ్లీలోకి ఎంట్రీ ఇద్దామని అనుకున్న ఎంఐఎం ప్రయత్నాలకు ప్రస్తుతానికి అడ్డుకట్ట పడింది. ఈ ఫలితాలపై ఎంఐఎం స్పందించింది. ''మా అభ్యర్థుల, పార్టీ పనితీరును మేము విశ్లేషిస్తాము'' అని ఏఐఎంఐఎం జాతీయ అధికార ప్రతినిధి ఆదిల్ హుస్సేన్ అన్నారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హుమాయున్ కబీన్ నేతృత్వంలోని ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏజేయూపీ) మాత్రం రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఏజేయూపీ అధినేత హుమాయున్... తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ (నౌదా, రెజినగర్) విజయం సాధించారు. హుమాయున్ కబీర్.. రెజినగర్‌లో 58 వేలకు పైగా మెజారిటీ, నౌదాలో 27 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. అయితే రెండు స్థానాల్లో విజయం సాధించిన హుమాయున్ కబీర్... ఏదో ఒక్క స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.
ఇక, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ సునామీ సృష్టించింది. బెంగాల్‌లో అధికారం చేపట్టాలనే తమ కలను సాకారం చేసుకుంది. బెంగాల్‌లో వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయత్నాలకు అడ్డకట్ట వేస్తూ... మొత్తం 294 స్థానాల్లో 206 స్థానాలు గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది.
Read more news like this on telugu.timesnownews.com

