Friday, 15 Jan, 3.19 pm Trending Telugu News

Posts
దళారీలను ఏరిపారేస్తామని, శ్రీవారి దర్శనం టికెట్ ధర పెంచుతారా?

తిరుమల శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా అందుతున్న నిధుల వినియోగం మీద ఒక శ్వేత ప్రతం విడుదల చేయాలని తిరుపతి యాక్టివిస్టు నవీన్ కుమార్ రెడ్డి టిటిడి కోరారు. శ్రీ వారి భక్తుల నుంచి  టికెట్ల ధరల రూపంలో సేకరించిన  ఈ నిధులు సద్వినియోగం అవుతున్నాయా అన్న అనుమానం వ్యక్తం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నిధులను వ్యయంచేయడం జరగరాదని ఆయన పేర్కొన్నారు.

ఈ నిధులతో ఎవరో ప్రజాప్రతినిధుల కోరిక మేరకు గుడులు కట్టడం కాకుండా అవసరమున్న చోట  మాత్రమే గుడుల నిర్మాణం చేపట్టాలని ఆయన సూచించారు. తెలుగు రాష్ట్రాలలో గుడులు లేని గ్రామాలు లేవన్న విషయం టిటిడికి గుర్తు చేస్తూ గుడులనిర్మాణం రాజకీయ నాయకులను సంతృప్తి పరిచేందుకు సాగిందన్న అపవాదురాకుండాచూడాలని ఆయన టిటిడిని కోరారు.

నవీన్ కుమార్ రెడ్డి వీడియో

శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులతో తెలుగు రాష్ట్రాలలో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని చెబుతున్న టీటీడీ మరోపక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాదాయ శాఖకు సంబంధించిన ఆలయాలను రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి వారి మెప్పు కోసం టిటిడి లో విలీనం చేసుకోవడం పై ఆత్మపరిశీలన చేసుకోవాలి! పరిస్థితి ఇలా ఉన్నపుడు మళ్లీ కొత్త గుడులు కడితే, వాటిని నిర్వహణ ఎలా? ఈ బాధ్యత టిటిడి పడితే, ఆర్థికంగా భారమవుతుందని ఆయన చెప్పారు.

నవీన్ చెప్పిన మరిన్ని విశేషాలు

ఈ ట్రస్టు  ద్వారా సంవత్సర కాలంలో టీటీడీ కి 100 కోట్ల ఆదాయం రావడం శ్రీవారి పై భక్తులకు ఉన్న నమ్మకానికి,విశ్వాసానికి నిదర్శనం!

శ్రీవారి భక్తుల నమ్మకాన్ని విశ్వాసాన్ని కేవలం వ్యాపార దృక్పథంతో చూస్తూ శ్రీవారి సన్నిధిలో "శ్రీవాణీ" ట్రస్టు టికెట్ పొందిన భక్తులకు కనీసం "హారతి" సైతం ఇవ్వకపోవడం బాధాకరం!

శ్రీ వాణి ట్రస్ట్ టికెట్ ధర ఒక్కరికి 10,500 తీసుకుంటున్నారు మొదట ప్రకటించిన దానికి భిన్నంగా శ్రీవారి సన్నిధిలో వ్యవహరిస్తున్నారు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి  బోర్డ్ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి  సభ్యులు పునః పరిశీలించి భార్యా భర్తలను లేక కనీసం ఇద్దరిని దర్శనానికి అనుమతించేలా బోర్డు సమావేశంలో తీర్మానం చేయండి!

తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టలేక శ్రీవాణి ట్రస్టు 10,500 రూపాయల దర్శనం టిక్కెట్ ప్రవేశ పెట్టాం అని చెప్పడం హాస్యాస్పదం, కొండపై ఇప్పటికీ చలామణి అవుతున్న వైట్ కాలర్ దళారీల పై దృష్టి పెట్టండి! దళారీలను ఏరిపారేస్తామని దర్శనం టికెట్ ధర పెంచడం న్యాయమా?

శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా వచ్చే నిధులను అవసరమున్న చోట మాత్రమే ఆలయాలు నిర్మించి మిగిలిన నిధులను టిటిడి ఉద్యోగస్తులు,భవిష్యత్ ధార్మిక కార్యక్రమాల కోసం టీటీడీ "కార్పస్ ఫండ్" లో జమ చేయాలి!

శ్రీ వాణి ట్రస్ట్ టిక్కెట్ల అమ్మకం ద్వారా టీటీడీ కి వచ్చిన100 కోట్ల ఆదాయంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఖర్చు పెట్టే ప్రతి పైసాకీ జవాబుదారితనంగా ఉంటూ శ్రీవారి భక్తులకు తెలిసేలా "శ్వేతపత్రం" విడుదల చేయాలి!

శ్రీవాణి టికెట్ ద్వార ఇప్పటివరకు దర్శనం చేసుకున్న వారిలో కనీసం కొంతమంది భక్తులతో వారు తిరుమల JEO ఆఫీస్ లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా టిటిడి చైర్మన్,ఈవో సంప్రదిస్తే శ్రీ వాణి ట్రస్ట్ ద్వార శ్రీవారి దర్శనం సంతృప్తికరంగా జరిగిందా లేదా అన్న వాస్తవం, లోటుపాట్లు,భక్తుల మనోవేదన తెలుస్తుంది!

 

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Trending Telugu News
Top