Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
₹20 లక్షల ప్యాకేజీ వదులుకున్నాడు... మనశ్శాంతిని గెలుచుకున్నాడు!

₹20 లక్షల ప్యాకేజీ వదులుకున్నాడు... మనశ్శాంతిని గెలుచుకున్నాడు!

Tupaki.com 6 days ago

ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే జీవితం సెట్ అయిపోయినట్లే!.. మన సమాజంలో దశాబ్దాలుగా వినిపిస్తున్న మాట ఇది. స్థిరమైన ఆదాయం, ఉద్యోగ భద్రత, సమాజంలో గౌరవం...

వీటి కోసం లక్షలాది మంది యువతీ యువకులు తమ రాత్రింబవళ్లను పుస్తకాలతోనే గడుపుతుంటారు. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక దాగున్న చీకటి కోణాన్ని నిశ్శబ్ద ఒత్తిడిని ధైర్యంగా ఎదిరించి ఒక కొత్త బాటను ఎంచుకున్నాడు 25 ఏళ్ల ఒక యువ ఇంజినీర్. డబ్బు కంటే మనశ్శాంతి, ఆత్మగౌరవమే ముఖ్యమని నిరూపించిన సౌరభ్ మిట్టల్ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపింది.

కలల ఉద్యోగం... కళ్ల ముందే సాకారం

హర్యానాలోని ప్రతిష్టాత్మక ఎన్ఐటీ కురుక్షేత్రలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సౌరభ్‌కు దేశంలోనే పేరుగాంచిన మహారత్న ప్రభుత్వ సంస్థ అయిన భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్ ) లో ఉద్యోగం లభించింది. ఏడాదికి దాదాపు ₹20 లక్షల ప్యాకేజీ! ఈ వార్త వినగానే కన్నవారి కళ్లల్లో ఆనందం, బంధువుల గుండెల్లో గర్వం నిండాయి. సగటు మధ్యతరగతి యువకుడికి ఇది ఒక కలల ఉద్యోగం. అందరూ అనుకున్నారు.. "సౌరభ్ లైఫ్ సెట్" అని! కానీ, అసలు కథ అక్కడే మొదలైంది.

మెరుపుల వెనుక చేదు నిజాలు

పశ్చిమ బెంగాల్‌లోని సిలిగుడిలో పోస్టింగ్ వచ్చిన తర్వాత సౌరభ్‌కు వాస్తవ పరిస్థితులు ఎదురయ్యాయి. ఆఫీసు బయట కనిపించే వైభవం లోపల లేదు. తాగడానికి మంచి నీరు.. వాడుకోవడానికి శుభ్రమైన టాయిలెట్లు లేని దుస్థితి. రాత్రింబవళ్లు శ్రమించినా దక్కని గుర్తింపు, అడగడానికే భయపడేలా చేసే సీనియర్ల ప్రవర్తన. అత్యవసర సమయాల్లో కూడా సెలవులు దొరకని వాతావరణం. ఈ పరిస్థితులు సౌరభ్‌ను శారీరకంగానే కాకుండా మానసికంగా తీవ్రంగా కుంగదీశాయి. ప్రతి నెలా బ్యాంకు ఖాతాలో పడే భారీ జీతం.. అతడి మనసుకు ప్రశాంతతను ఇవ్వలేకపోయింది. "జీవితంలో ఆనందం, ప్రశాంతత లేనప్పుడు... ఆఫీస్ లాకర్‌లో ఉండే లక్షల రూపాయల శాలరీ స్లిప్‌లు మనల్ని సంతోషపెట్టలేవు.'' అని డిసైడ్ అయ్యాడు.

లోకం ఏమనుకుంటుందో అనే భయాన్ని వీడి...

సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది "ఇంత మంచి ఉద్యోగం వదులుకుంటే సమాజం ఏమంటుంది? ఇంట్లో వాళ్లు ఏమైపోతారు?" అని భయపడి.. నచ్చని నరకాన్ని భరిస్తూ బతికేస్తుంటారు. కానీ సౌరభ్ భయపడలేదు. తన మానసిక ఆరోగ్యానికి ఆత్మగౌరవానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. భారీ ప్యాకేజీని తృణప్రాయంగా భావించి, ధైర్యంగా తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

నేటి యువతకు సౌరభ్ ఇస్తున్న సందేశం

సౌరభ్ తీసుకున్న నిర్ణయం కేవలం ఒక ఉద్యోగాన్ని వదులుకోవడం కాదు, అది ఒక పెద్ద సామాజిక మార్పుకు సంకేతం. ఈ కథ నేటి తరం యువతకు, కార్పొరేట్/ప్రభుత్వ రంగానికి కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుచేస్తోంది. ఉద్యోగం అంటే కేవలం జీతం మాత్రమే కాదు. పని చేసే చోట గౌరవం, కనీస వసతులు, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి.

సోషల్ మీడియాలో చూసే లగ్జరీ లైఫ్ స్టైల్, పెద్ద ప్యాకేజీలు మాత్రమే జీవితం కాదు. అంతిమంగా మనిషికి కావలసింది మనశ్శాంతి. నచ్చని, మనల్ని చంపేసే వాతావరణంలో బలవంతంగా ఇరుక్కుపోవడం కంటే, మన మనసుకు నచ్చిన దారిని వెతుక్కుంటూ బయటకు రావడం కూడా ఒక గొప్ప సాహసమే.

సౌరభ్ మిట్టల్ కథ కేవలం ఒక రాజీనామా వార్త కాదు. అది నవతరం ఆలోచనల ప్రతిబింబం. భవిష్యత్తుపై నమ్మకంతో తన మనశ్శాంతి కోసం ₹20 లక్షల జీతాన్ని వదులుకున్న సౌరభ్ నిర్ణయం... కచ్చితంగా ఒత్తిడితో నలిగిపోతున్న ఎందరో యువకులకు ఒక కొత్త దిశను, ధైర్యాన్ని చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu