Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ ఉత్తరాంధ్ర నేత ఎవరు? - వైసీపీలో విజయసాయిరెడ్డి సస్పెన్స్!

ఆ ఉత్తరాంధ్ర నేత ఎవరు? - వైసీపీలో విజయసాయిరెడ్డి సస్పెన్స్!

Tupaki.com 3 weeks ago

విపక్షం వైసీపీలో మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. తన లేఖలో వైసీపీ నుంచి బయటకు రావడానికి దారితీసిన కారణాలను స్పష్టం చేయడమే కాకుండా, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి.

ఇదే సమయంలో ఉత్తరాంధ్ర ఇంచార్జిగా తనను తప్పించడానికి సజ్జలతోపాటు ఉత్తరాంధ్ర నేత ఒకరు కుట్ర చేశారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఆ ఉత్తరాంధ్ర నేత ప్రస్తుతం పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారంటూ లీకులిచ్చారు. విజయసాయిరెడ్డి లేఖలో ఆ ఉత్తరాంధ్ర నేత పేరు రాయకపోవడంతో పార్టీ మారడానికి ప్రయత్నిస్తున్న ఆ నాయకుడు ఎవరంటూ అంతర్గతంగా విస్తృత చర్చ జరుగుతోంది.

ఉత్తరాంధ్రకు చెందిన నాయకుడు ఒకరు పార్టీ మారడానికి సిద్దంగా ఉన్నారంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన లీకు వైసీపీలో హాట్ టాపిక్ అవుతోంది. స్థానిక ఎన్నికల వేళ ఆ ఉత్తరాంధ్ర నాయకుడు ఎవరు అంటూ సాధారణ కార్యకర్తల నుంచి పార్టీ అధిష్టానం పెద్దలు వరకు ఆరా తీస్తున్నారు. పార్టీ అధిష్టానానికి బాగా దగ్గరగా ఉన్న నేత అంటూ విజయసాయిరెడ్డి చెప్పడంతో ఆ నేత మాజీ మంత్రి అయ్యే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు మాజీ మంత్రులు, వారి ప్రస్తుత తీరుతెన్నులను చర్చిస్తూ పార్టీ మారేందుకు ఉన్న అవకాశాలపై ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆ నేత బొత్స అవ్వొచ్చా?

పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న ఉత్తరాంధ్ర నేత అంటూ పేరు చెప్పకుండా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సస్పెన్స్ క్రియేట్ చేయడంతో ఆ నేత బొత్స కావచ్చునేమో అంటూ పలువురు పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరనున్నారంటూ బొత్సపై పలు ఉహాగానాలు వ్యాపించాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారానికి ఎటువంటి ప్రాతిపదిక లేకపోయినా వదంతులు మాత్రం వేగంగా విస్తరించాయి. అయితే ఈ ఊహాగానాలపై బొత్స, ఆయన అనుచరులు స్పందించలేదు. ఊరు, పేరు లేని ప్రచారాన్ని ఖండించాల్సిన అవసరం లేకపోయినా, రాజకీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల క్లారిటీ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ ప్రచారాన్ని నమ్మి బొత్స పేరు ప్రస్తావించకుండా ఆరోపణలు చేశారా? లేక ఇంకెవరైనా నిర్దిష్టమైన నేత పార్టీ మార్పుపై ఆయనకు సమాచారం ఉందా? అన్న విషయంపై క్లారిటీ రావాల్సివుందని అంటున్నారు.

ఇంకెవరు అవ్వొచ్చు!

వైసీపీలో విజయసాయిరెడ్డి పనిచేసిన సమయంలో ఆయనే బలవంతుడు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడు. అలాంటి నేతపై చాడీలు చెప్పి, పదవి నుంచి తొలగించేలా చేయగలిగే నాయకుడు ఉత్తరాంధ్రలో ఎవరై ఉంటారనేది విస్తృత చర్చగా ఉంది. ఉత్తరాంధ్రలో వైసీపీ హయాంలో చాలా మంది మంత్రులుగా పనిచేశారు. అందరిలో సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమరనాథ్ మాత్రమే నేరుగా అధిష్టానంతో సంప్రదింపులు జరిపే సత్తా ఉన్నా నేతలుగా చెబుతున్నారు. వీరిలో విజయసాయిరెడ్డికి పొగ పెట్టినంత దమ్ము ఎవరికి ఉంది? అన్నదే పార్టీలో చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. పార్టీని గందరగోళంలోని నెట్టేందుకు విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ అడుతున్నారా? లేక నిజంగానే తనను టార్గెట్ చేసిన ఉత్తరాంధ్ర నేతపై అపనమ్మకం కలిగించే వ్యూహంతో లేఖరాశారా అన్నదే తేలాల్సివుందని అంటున్నారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu