Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆఫ్‌లైన్ పరీక్షతోనే తంటా.. నీట్ కు డిజిటల్ మార్గమే పరిష్కారమా?

ఆఫ్‌లైన్ పరీక్షతోనే తంటా.. నీట్ కు డిజిటల్ మార్గమే పరిష్కారమా?

Tupaki.com 1 week ago

నీట్-2026 పరీక్ష రద్దు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తరచూ నీట్ పరీక్షకు లీకుల బెడద వెంటాడుతుండటంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నీట్ పరీక్షను నిర్వహిస్తున్న విధానమే లీకులకు కారణమంటూ ఆవేదన చెందుతున్నారు. దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఎంట్రన్స్ టెస్ట్ లు నిర్వహిస్తున్న జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ కు ఆఫ్‌లైన్ పరీక్ష నిర్వహించడమే సమస్యలకు కారణమవుతోందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నీట్, జేఈఈ పరీక్షలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీనే నిర్వహిస్తున్నప్పటికీ జేఈఈకి రాని సమస్య నీట్ కు ఎదురవడానికి కారణం పరీక్ష విధానమే అంటున్నారు.

జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ పర్యవేక్షణలోనే నీట్, జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తుంటారని అంటున్నారు. నీట్ ఆఫ్‌లైన్ విధానంలో జేఈఈ మెయిన్స్ ను ఆన్ లైన్ విధానంలో నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. దీంతో జేఈఈ సమస్య తక్కువ సమయంలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. అదేసమయంలో నీట్ ను ఆఫ్‌లైన్ విధానంలో పెడుతుండటం వల్ల ఎక్కువ మంది భాగస్వామ్యం, రవాణాకు భారీగా వాహనాలను వాడకం జరుగుతోందని ఈ కారణంతో ఏదో ఒక చోట లీకులకు అవకాశం ఏర్పడుతోందని అభిప్రాయపడుతున్నారు.

దేశవ్యాప్తంగా అత్యధికంగా విద్యార్థులు హాజరయ్యే పరీక్ష కావడంతో నీట్ పై భారీగా ఫోకస్ ఉంటుందని అంటున్నారు. దేశంలో సుమారు లక్ష మెడికల్ సీట్ల భర్తీకి ఏటా నీట్ ఎంట్రన్స్ నిర్వహిస్తుండగా, సగటున 20 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఒకే రోజు 13 భాషల్లో పరీక్ష నిర్వహించాల్సివస్తోందని అంటున్నారు. దీనివల్ల పరీక్ష కేంద్రాలు సమకూర్చడం, ఆయా భాషల్లో ప్రశ్నపత్రాల తయారీ వంటివి తీవ్ర ప్రయాసగా మారుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఏదో ఒక వైపు నుంచి లీకుల బెడద నీట్ పరీక్షలను వెంటాడుతోందని అంటున్నారు.

దీనికి భిన్నంగా జేఈఈ పరీక్షలు జరుగుతుండటంతో సమస్యలు ఉండటం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. జేఈఈ పరీక్షలను ఆన్ లైన్ విధానంలో షిప్టుల వారీగా నిర్వహిస్తుండటంతో అత్యంత పకడ్బందీగా పరీక్షలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. అయితే జేఈఈ మాదిరిగా నీట్ ను ఆన్ లైనులో నిర్వహించడం అంత తేలికైన పనికాదని అంటున్నారు. నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా 23 లక్షల మంది రాస్తుంటే, జేఈఈకి మాత్రం కేవలం 13 నుంచి 14 లక్షల మంది మాత్రమే హాజరవుతున్నారని, దీనివల్ల జేఈఈకి ఆన్ లైన్ పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేయడంలో ఇబ్బందిలేదని అంటున్నారు. కానీ, నీట్ విషయంలో ఆన్ లైన్ పరీక్షకు కేంద్రాలను సమకూర్చడమే పెద్ద సమస్యగా మారిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక నీట్ పరీక్షలకు లీకుల బెడద నుంచి కాపడటానికి ఆన్ లైన్ మార్గం ఒక్కటే ఉందని అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఏ ఈ దిశగా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుంటే ఏటా ఇదే పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. నీట్ కోచింగ్ సెంటర్ల మధ్య పోటీ కూడా పేపర్ లీకులకు కారణమవుతోందని, ప్రభుత్వం ఈ విషయంలో నిఘా పెంచి కోచింగ్ సెంటర్లను నియంత్రించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu