Dailyhunt
ఆకివీడులో హై అలెర్ట్.. భారీగా పోలీసులు.. అసలు ఏం జరుగుతోంది..

ఆకివీడులో హై అలెర్ట్.. భారీగా పోలీసులు.. అసలు ఏం జరుగుతోంది..

Tupaki.com 1 week ago

శ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా ఓ ఆలయానికి సంబంధించిన వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో "చలో ఆకివీడు" అంటూ తెలియని వ్యక్తులు పిలుపునివ్వడం మరింత కలకలం రేపింది. ఈ పిలుపు వెనుక ఎవరు ఉన్నారన్నది ఇంకా స్పష్టత రాకపోవడంతో అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఆలయ వివాదం మత సంబంధిత అంశంగా ఉండటం వల్ల ఎక్కడైనా ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆకివీడు పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉండగా ఎలాంటి గుంపులు చేరకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

ఈ వివాదానికి ఆరంభం శ్రీరామనవమి రోజున చోటుచేసుకున్న ఘటన. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఆకివీడులోని ఓ రామాలయానికి వెళ్లి శ్రీరాముడి విగ్రహానికి పూలమాలలు అర్పించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆలయానికి సంబంధించిన వివాదం కొనసాగుతుండటంతో స్థానికులలో కొందరు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన క్రమంగా ఉద్రిక్తతలకు దారి తీసింది.

ఈ సమయంలో కొందరు వ్యక్తులు మేకులు, ఇతర ఆయుధాలతో దాడికి యత్నించగా, కూటమి నేతలు గాయపడ్డారు. ఈ దాడి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నాయకుడిపై దాడి జరగడం పట్ల అన్ని వర్గాల నుంచి ఖండనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, వెంటనే చర్యలు చేపట్టి 21 మందిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు.

ఇప్పటికే పరిస్థితి సున్నితంగా ఉండటంతో, ఆకివీడులో పోలీసులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన "చలో ఆకివీడు" పిలుపు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ పిలుపు ఎవరి నుంచి వచ్చిందన్నది తెలియకపోయినా దాని ప్రభావం ఎలా ఉంటుందోనన్న ఆందోళన అధికారుల్లో కనిపిస్తోంది.

అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు నుంచి ఎటువంటి పిలుపు రాలేదని, ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం అయింది. అలాగే ఏ రాజకీయ లేదా సామాజిక సంస్థలు కూడా అధికారికంగా ఈ పిలుపును ప్రకటించలేదు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఆకివీడు పూర్తిగా పోలీసుల నియంత్రణలో ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య స్థానిక ప్రజల్లో ఆందోళన, ఉత్కంఠ నెలకొన్నాయి. పరిస్థితులు ఎటు దారితీస్తాయోనన్న టెన్షన్ మధ్య, పోలీసులు శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu