Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్బీఐ అత్యవసర ప్లాన్..! డాలర్ పరుగుకు బ్రేకు.. రూపాయికి రక్షణ?

ఆర్బీఐ అత్యవసర ప్లాన్..! డాలర్ పరుగుకు బ్రేకు.. రూపాయికి రక్షణ?

Tupaki.com 3 days ago

అంతర్జాతీయ పరిణామాలతో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న 'రూపాయి'ని ఆదుకునేందుకు రిజర్వు బ్యాంకు రంగంలోకి దిగిందని ప్రచారం జరుగుతోంది.

ముందెన్నడూ లేనంతగా రూపాయి పతనం అవుతుండటంతో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. డాలర్ తో రూపాయి మారకం విలువ 97 రూపాయలకు సమీపించడంతో అత్యావసర చర్యలు తీసుకోవాలని నిర్ణయించారని అంటున్నారు. ఇందులో భాగంగా వడ్డీ రేట్లు సవరించడంతోపాటు పలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెబుతున్నారు.

రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యవసర చర్యలకు సిద్ధమవుతోందన్న ప్రచారం సరికొత్త ఆశలు రేపుతోందని అంటున్నారు. వడ్డీ రేట్లను పెంచడంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ 'బ్లూమ్‌బెర్గ్' తన కథనంలో వెల్లడించింది. రూపాయి విలువ వరుసగా 9 సెషన్ల పాటు క్షీణించడంతో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం వరుస అంతర్గత సమావేశాలను నిర్వహించించారని, రూపాయిని కాపాడుకునేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఆ కథనంలో వెల్లడించింది.

రూపాయి పతనం ఇలాగే కొనసాగితే జూన్ 5న జరగబోయే మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని అంటున్నారు. వడ్డీ రేట్లు పెంచడం ద్వారా అమెరికా-భారత్ మధ్య ఉన్న వడ్డీ రేట్ల వ్యత్యాసం తగ్గి, విదేశీ పెట్టుబడులు మళ్లీ భారత్‌కు వచ్చే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యత పెంచేందుకు డాలర్ నిల్వలను బలోపేతం చేసేందుకు 5 బిలియన్ డాలర్ల విలువైన 3 సంవత్సరాల కాలపరిమితి గల 'యూఎస్‌డీ-ఐఎన్‌ఆర్ బై/సెల్ స్వాప్' వేలాన్ని ఇప్పటికే ఆర్‌బీఐ ప్రకటించింది. అవసరమైతే మరిన్ని స్వాప్ వేలాలు నిర్వహించనున్నారని కూడా చెబుతున్నారు.

విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయుల (NRI) నుంచి ప్రత్యేక డిపాజిట్ స్కీమ్‌ల ద్వారా డాలర్లను సేకరించడం లేదా విదేశీ మార్కెట్లలో సావరిన్ డాలర్ బాండ్లను జారీ చేయడం వంటి ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం, ఆర్‌బీఐ పరిశీలిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుత ఆర్‌బీఐ చర్యలు 2013 నాటి 'టాపెర్ టాంట్రమ్' సంక్షోభాన్ని గుర్తుకు తెస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు అప్పట్లో రూపాయి విలువ ఘోరంగా పడిపోయినప్పుడు, అప్పటి ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఎన్‌ఆర్ఐ డిపాజిట్ స్కీమ్స్ ప్రవేశపెట్టారని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా కఠినమైన ద్రవ్య విధానాల ద్వారా రూపాయిని నిలబెట్టారని చెబుతున్నారు. ఇప్పుడు కూడా ఆర్‌బీఐ అదే తరహా వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోందని అంటున్నారు.

ట్రంప్ ప్రకటనతో కోలుకున్న రూపాయి

కాగా, సంక్షోభం మధ్యలో గురువారం ఉదయం రూపాయికి స్వల్ప ఊరట లభించింది. ఇరాన్‌తో చర్చలు చివరి దశకు వచ్చాయని, త్వరలోనే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 105 డాలర్ల స్థాయికి తగ్గింది. ఆర్‌బీఐ రంగంలోకి దిగి డాలర్లను విక్రయించడం, చమురు ధరలు తగ్గడంతో రూపాయి ఆల్-టైమ్ కనిష్టం నుంచి 41 పైసలు కోలుకుని 96.45 స్థాయికి చేరుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu