Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆశ ఎక్కువైతే ఆస్తులు కూడా ఆపదగా మారతాయ్.. ఎన్నారైలకు ఇప్పుడు అర్థమవుతోంది..

ఆశ ఎక్కువైతే ఆస్తులు కూడా ఆపదగా మారతాయ్.. ఎన్నారైలకు ఇప్పుడు అర్థమవుతోంది..

Tupaki.com 2 weeks ago

ప్పట్లో అమెరికా అంటే మంచి జాబ్.. డాలర్ల వర్షం.. వీకెండ్ సరదాలు.. సొంత ఊరి బంధువుల ముందు బిల్డప్‌లు. కానీ కరోనా పుణ్యమా అని 'వర్క్ ఫ్రమ్ హోమ్' వెసులుబాటు రావడంతో మన హెచ్1బీ వీసా మహానుభావులకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.

ఐటీ కంపెనీలు కళ్లు మూసుకుని ఇచ్చే భారీ ప్యాకేజీలు, పైగా దొంగచాటుగా రెండు చోట్ల చేసే ఉద్యోగాలు ఒకేసారి మూన్‌లైటింగ్ చేసే కుషన్ దొరకడంతో ఊహలు ఆకాశాన్ని తాకాయి. బ్యాంకుల్లో ఊరికే పడి ఉన్న డాలర్లను చూసి.. "అకౌంట్‌లో ఉంటే ఏం బాగుంటుంది? పోనీ ఓ రెండూ మూడు ఇళ్లు కొనేద్దాం" అని ఫిక్స్ అయిపోయారు.

అనుకున్నదే తడవుగా తక్కువ వడ్డీ రేట్ల ఆశ చూపి బ్యాంకులు పిలిచి మరీ అప్పులిస్తుంటే.. సొంతింటితో పాటు ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో మరో రెండు ప్రాపర్టీలను ఖాతాలో వేసుకున్నారు. "ఓ ఇంటికి అద్దె వస్తుంది. దాంతోనే మార్ట్‌గేజ్ కట్టేయొచ్చు. ఎలాగో డ్యూయల్ ఇన్‌కమ్ ఉంది కదా" అని వేసుకున్న లెక్కలు చూసి వేళ్లపై లెక్కలేసుకుని మురిసిపోయారు.

కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. మహమ్మారి తగ్గింది, టెక్ కంపెనీలకు జ్ఞానోదయం అయింది. లేఆఫ్‌లు, పింక్ స్లిప్పుల పర్వం మొదలైంది. ఒకప్పుడు రెడ్ కార్పెట్ వేసి పిలిచిన కంపెనీలే ఇప్పుడు క్యాబిన్ సర్దేసి వెళ్లమంటున్నాయి. ఈ ట్విస్ట్‌తో ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే.. "ముందర చూస్తే ఉద్యోగం ఊడే ముప్పు.. వెనక్కి చూస్తే నెలకు వేల డాలర్ల ఈఎంఐల దెబ్బ" లా మారింది.

అప్పట్లో "ప్రాపర్టీ అంటే అసెట్" అని ఎగిరి గంతేసి కొన్న ఇళ్లు ఇప్పుడు 'అడకత్తెరలో పోకచెక్కలా' మారాయి. పోనీ ప్రాపర్టీని అమ్మేద్దామా అంటే మార్కెట్లో కొనే నాథుడు లేడు. ఆశించిన ధర అసలే రాదు. అద్దెకు ఇద్దామంటే టెనెంట్లు దొరకరు. సరే ఇంట్లో ఉన్న సగం భారం తగ్గిస్తుందని ఆశపడ్డ హెచ్-4 ఈఏడీ వీసా ఇల్లాళ్ల ఉద్యోగాలపైనా ఇమ్మిగ్రేషన్ నిబంధనల కత్తులు నిరంతరం వేలాడుతూనే ఉన్నాయి. ఒక వైపు కార్ లోన్లు.. మరోవైపు పిల్లల స్కూల్ ఫీజులు.. వీటిని మించిన భారీ మార్ట్‌గేజ్ చెల్లింపులు.. ఉద్యోగం పోతే ఇవన్నీ ఎలా కట్టాలో తెలియక గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఒకప్పుడు సోషల్ మీడియాలో "మరో ప్రాపర్టీ కొన్నాం గైస్" అని ఫోటోలు పెట్టి బిల్డప్ ఇచ్చిన మన ఎన్నారైలు.. ఇప్పుడు ప్రతి నెలా వచ్చే మార్ట్‌గేజ్ స్టేట్‌మెంట్లు చూసి రాత్రిళ్లు నిద్రలేక అల్లాడుతున్నారు. అప్పట్లో 'అమెరికన్ డ్రీమ్' కోసం కన్న కలలు, ఇప్పుడు ఈఎంఐల రూపంలో పీడకలగా మారి ప్రాణం తీస్తున్నాయి. లాక్కోలేక.. పీక్కోలేక గాలిలో తేలుతున్న ఈ హెచ్1బీ కుటుంబాలను చూస్తుంటే.. "ఆశ ఎక్కువైతే ఆస్తులు కూడా ఆపదగా మారతాయ్" అనే సామెత అక్షరాలా నిజం అనిపిస్తోంది!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu