Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అడవిలో ఘోరం.. నలుగురిని బలితీసుకున్న పులి

అడవిలో ఘోరం.. నలుగురిని బలితీసుకున్న పులి

Tupaki.com 3 days ago

హారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. బీడి ఆకుల సేకరణకు వెళ్లిన మహిళలపై పులి దాడి చేసి నలుగురిని చంపేసింది. మొత్తం 13 మంది మహిళలు శుక్రవారం అడవిలోకి వెళ్లగా, పొదల్లో మాటువేసిన పులి ఒక్కసారిగా విరుచుకుపడింది.

ఈ హఠాత్ పరిణామంతో మహిళలు చెల్లాచెదురయ్యారు. నలుగురు మాత్రం పులి దాడి నుంచి తప్పించుకోలేకపోయారని అంటున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర ఏజెన్సీలో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. మానవ రక్తం రుచి చూసిన పులి ఇంకెలా ప్రవర్తిస్తుందనేది తెలియక అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారు టెన్షన్ పడుతున్నారు.

చంద్రపూర్ జిల్లా సిందేవాహి తాలూకా పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి దాడి ఘటన స్థానికులను నిలువెల్లా వణికిస్తోంది. 13 మంది మహిళల బృందం ఉదయం 8 గంటల ప్రాంతంలో తునికాకులను సేకరించడానికి అడవిలోకి వెళ్లినట్లు చెబుతున్నారు. ఎప్పుట్లానే మహిళలు అడవిలో తూనికాకు సేకరిస్తుండగా, పొదల్లో పొంచి ఉన్న పులి ఒక్కసారిగా వారిపై విరుచుకుపడిందని చెబుతున్నారు. నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా పులుల సంచారం ఎక్కువగా ఉందని, అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేసినప్పటికీ జీవనోపాధి కోసం అడవిపై ఆధారపడే గిరిజనులు, గ్రామీణులు ఇలాంటి ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చంద్రపూర్ జిల్లాలో స్థానికులు అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవిస్తుంటారని చెబుతున్నారు. బీడి ఆకులతోపాటు అడవిలో లభించే రకరకాల పంటలను సేకరించి సంతల్లో అమ్ముకుని పొట్ట నింపుకుంటారు. ఈ ప్రాంతంలో వన్యప్రాణులు, ముఖ్యంగా పులుల సంచారం ఎక్కువగా ఉంటుందనే ఆలోచనతో గుంపులుగా వెళతారు. అయితే ఎన్నడూ లేనట్లు పులి మాటువేసి దాడి చేయడంతో నలుగురు మహిళలు ఒకేసారి ప్రాణాలు కోల్పోవాల్సివచ్చిందని అంటున్నారు. సాధారణంగా మానవుల అలికిడితో పులులు పక్కకు వెళ్లిపోతుంటాయని అటవీ అధికారులు చెబుతున్నారు. కానీ, ఈ సారి పులి మాటు వేసి దాడి చేయడమే టెన్షన్ పెడుతోందని అంటున్నారు. పులి దాడిలో మరణించిన మహిళలు అంతా మధ్య వయస్కులే.. అంతా 45 ఏళ్లలోపు వారే కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

పులి ఎందుకు దాడి చేస్తుంది?

సాధారణంగా పులులు క్రూర జంతువులైనప్పటికీ, అవి స్వభావరీత్యా 'షై యానిమల్స్'గా చెబుతారు. అంటే సిగ్గుపడే లేదా మానవ సంచారానికి దూరంగా ఉండే జంతువులని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. అడవుల్లో కూడా అవి గుంపులుగా కాకుండా ఒంటరిగా తిరగడానికే ఇష్టపడతాయి. మనుషులు కనిపిస్తే అవి దాడి చేయడం కంటే, అక్కడి నుంచి దూరంగా వెళ్లడానికే ప్రయత్నిస్తాయని వివరిస్తున్నారు. కానీ, చంద్రపూర్ ఘటనలో పులి మాటు వేసి దాడి చేయడం అంతుచిక్కడం లేదని అంటున్నారు. దీనికి పులి మానసిక ఆరోగ్యం కారణమై ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.

పులులు తమ మనుగడకు లేదా తమ పిల్లలకు ముప్పు వాటిల్లుతుందని భావిస్తేనే ఎదురుదాడికి దిగుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా మనుషులు పులుల ప్రధాన ఆవాసాలలోకి ప్రవేశించినప్పుడు, అవి తమను తాము రక్షించుకోవడానికి లేదా భయంతో దాడి చేస్తాయని అంటున్నారు. తునికాకు సేకరణ సమయంలో మహిళలు కిందకు వంగి పనిచేస్తుంటారు. అలాంటప్పుడు దూరం నుంచి చూసే పులికి వారు మనుషులుగా కాకుండా, వేరే ఏదైనా జంతువుగా భావించి దాడి చేసి ఉండొచ్చునని అనుమానిస్తున్నారు.

'రక్తం రుచి' మరిగిన పులితో ప్రమాదమా?

ఇక చంద్రపూర్ లో దాడి చేసిన పులి.. తర్వాత ఎలా ప్రవర్తిస్తుందనేది టెన్షన్ పెడుతోందని చెబుతున్నారు. ఒకసారి అనుకోకుండానైనా మనిషిపై దాడి చేసి, రక్తం రుచి మరిగిన పులి ప్రవర్తనలో ఊహించని మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణ వన్యప్రాణులను వేటాడటం కంటే మనుషులను వేటాడటం సులభమని పులి గ్రహిస్తే చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. వయసు పైబడిన, గాయపడిన లేదా పళ్ళు ఊడిపోయిన పులులు అడవిలో వేగంగా పరిగెత్తే జింకలు, అడవి పందులను వేటాడలేక, సులభమైన వేట కోసం గ్రామ సరిహద్దుల్లోకి రావడం ప్రారంభిస్తాయని అంటున్నారు.

ఇక అడవులు నశించిపోతుండటం, పులుల సంఖ్యకు సరిపడా అటవీ ప్రాంతం లేకపోవడం వల్ల అవి గ్రామాల వైపు వస్తున్నాయని అంటున్నారు. చంద్రపూర్ జిల్లాలో పులుల సాంద్రత ఎక్కువ. దాంతో తమ పరిధిని విస్తరించుకునే క్రమంలో పులులు అటవీ సమీప గ్రామాలు, వ్యవసాయ పొలాల్లోకి ప్రవేశిస్తూ మనుషులతో సంఘర్షణకు సిద్ధమవుతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుత ఘటన నేపథ్యంలో అటవీ ప్రాంత సరిహద్దుల్లో ఉన్న ప్రజలు ఒంటరిగా అడవుల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేకువజామున, చీకటి పడే సమయాల్లో పులులు ఎక్కువగా సంచరిస్తాయని, ఆ సమయాల్లో సమూహాలుగా వెళ్లడం లేదా అడవిలోకి వెళ్లకుండా ఉండటమే సురక్షితమని సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu