Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అద్దె వర్సెస్ పర్సంటేజీ: 15మందితో కమిటీ.. 2 నెలల్లో నివేదిక

అద్దె వర్సెస్ పర్సంటేజీ: 15మందితో కమిటీ.. 2 నెలల్లో నివేదిక

Tupaki.com 1 week ago

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా కొనసాగుతున్న థియేటర్ల అద్దె వివాదానికి ఎట్టకేలకు ఒక స్పష్టమైన పరిష్కార మార్గం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఎగ్జిబిటర్లు - నిర్మాతల మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు డి. సురేష్ బాబు నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమలోని అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ 15 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఐదుగురు నిర్మాతలు, ఐదుగురు పంపిణీదారులు, ఐదుగురు ఎగ్జిబిటర్లు సభ్యులుగా ఉండి సమస్యను లోతుగా అధ్యయనం చేయనున్నారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న పాత ఫిక్స్‌డ్ రెంటల్ (స్థిర అద్దె) విధానం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని... ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో దానిని కొనసాగించడం కష్టమని సినీ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే పరిశ్రమ అధికారికంగా `పర్సంటేజీ షేరింగ్` (రాబడిలో వాటా) విధానం వైపు అడుగులు వేస్తోంది. ఈ కొత్త రెవెన్యూ మోడల్‌ను ఎలా అమలు చేయాలి? వసూళ్లలో వాటాల పంపిణీ ఎలా ఉండాలి అనే అంశాలపై సమగ్రమైన విశ్లేషణ చేసి.. రాబోయే రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని ఛాంబర్ ఈ కమిటీని ఆదేశించింది.

సీనియర్ నిర్మాత సి. కళ్యాణ్ ఈ సమావేశం అనంతరం మాట్లాడుతూ.. చర్చలు చాలా సానుకూల వాతావరణంలో జరిగాయని వెల్లడించారు. కేవలం అద్దె వివాదం మాత్రమే కాకుండా.. పరిశ్రమకు సంబంధించిన ఇతర పెండింగ్ సమస్యలను కూడా ఈ రెవెన్యూ షేరింగ్ ఇష్యూతో ముడిపెట్టి ఒకేసారి పరిష్కరించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే 1 నుండి 2 నెలల కాలంలో ఈ సమస్యలన్నింటికీ ఒక సంపూర్ణమైన పరిష్కారం లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇది ఇండస్ట్రీలోని అన్ని రంగాల ప్రయోజనాలను కాపాడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ల మనుగడకు పర్సంటేజీ విధానం సహకరిస్తుందని భావిస్తున్నారు.

మరోవైపు ఈ పర్సంటేజీ మోడల్ వివాదం కారణంగా తమ సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదని మైత్రీ మూవీ మేకర్స్ ఈ సమావేశంలో ప్రత్యేకంగా విన్నవించింది. రామ్ చరణ్ నటించిన `పెద్ది' చిత్రం ఇప్పటికే పలు కారణాల వల్ల మార్చి 27 , ఏప్రిల్ 30 తేదీల్లో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ వివాదం తలెత్తక ముందే తాము సినిమా విడుదలను ప్లాన్ చేశామని.. కాబట్టి కొత్త విధానం అమలు పేరుతో `పెద్ది` విడుదలకు ఇబ్బంది కలిగించవద్దని వారు ఎగ్జిబిటర్లను రిక్వెస్ట్ చేశారు. దీనికి ఎగ్జిబిటర్ల నుండి కూడా సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది.

ఎట్టకేలకు తెలుగు సినిమా పరిశ్రమ ఒక చారిత్రాత్మక సంస్కరణ దిశగా పయనిస్తోంది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అమలులోకి రానున్న పర్సంటేజీ విధానం వల్ల థియేటర్ల మనుగడ సాధ్యమవుతుందని... బాక్సాఫీస్ వద్ద పారదర్శకత పెరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. అదే సమయంలో సింగిల్ స్క్రీన్లపై పెద్దన్నల గుత్తాధిపత్యానికి అవకాశం లేకుండా కమిటీ తన నివేదికలో కీలక విషయాలను ప్రస్థావించాల్సి ఉంటుందని కూడా అభప్రాయం వ్యక్తమవుతోంది. `పెద్ది` వంటి భారీ చిత్రాలు సజావుగా విడుదల కావడానికి, అదే సమయంలో చిన్న సినిమాలకు థియేటర్ల భారం తగ్గడానికి ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న రెవెన్యూ షేరింగ్ విధానం దోహదపడనుంది. ఈ రెండు నెలల కాలం టాలీవుడ్ భవిష్యత్తు వ్యాపార సరళిని నిర్ణయించడంలో అత్యంత కీలకం కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu