Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అదొక పీడకల.. గుండె ఆగిపోయేలా వెన్నుపోటు పొడిచాడు: ఆర్జీవీ

అదొక పీడకల.. గుండె ఆగిపోయేలా వెన్నుపోటు పొడిచాడు: ఆర్జీవీ

Tupaki.com 2 days ago

దొక పీడకల.. భయంకరమైన రోజు.. నా గుండె ఆగిపోయేలా చేసి వెన్ను పోటు పొడిచిన రోజు.. అంటూ ఆరోజు ఆ ఇరుకు గదిలో సన్నివేశం గురించి ఆర్జీవీ చెప్పుకొచ్చిన ఒక విషయం నిజంగా ఈరోజు చాలామంది హృదయాలను రగిలించింది.

ఇంతకీ ఆ రోజు ఆ ఘటన ఏమై ఉంటుంది?

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేసిన ఒక సుదీర్ఘ భావోద్వేగ లేఖ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాప్ ప్రపంచ చక్రవర్తి మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ `మైఖేల్` చూసిన తర్వాత వర్మ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లారు. ఎప్పుడూ తన మనసులోని మాటను నిర్మొహమాటంగా చెప్పే ఆర్జీవీ ఈసారి మాత్రం మైఖేల్ జాక్సన్ పై తనకున్న అమితమైన ప్రేమను.. అంతకు మించిన ఒక విచిత్రమైన `ద్వేషాన్ని` ఎంతో సూటిగా బయటకు వెల్లడించారు. జాక్సన్ తనకు కేవలం ఒక అంతర్జాతీయ సూపర్ స్టార్ మాత్రమే కాదని.. దేవుని అద్భుత సృష్టి అని వర్మ కొనియాడారు.

ఈ లేఖలో ఆర్జీవీ తన కాలేజీ రోజులను గుర్తుచేసుకుంటూ.. 2 జనవరి 1984న విజయవాడలోని ఒక చిన్న ఇరుకైన వీడియో పార్లర్‌లో `మైఖేల్ జాక్సన్` సృష్టించిన ప్రభంజనం `థ్రిల్లర్` ఆల్బమ్‌ను తన స్నేహితుడితో కలిసి మొదటిసారి చూసిన క్షణాన్ని వివరించారు. ఆ చీకటి గదిలో థ్రిల్లర్ సాంగ్ తనను ఒక పిడిగుద్దులా తాకిందని.. అప్పటివరకు సాధారణ కళ్లతో లోకాన్ని చూసిన తనకు ఆ కొరియోగ్రఫీ- ప్రొడక్షన్ వాల్యూస్ ఒక సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయని పేర్కొన్నారు. మైఖేల్ జాక్సన్ ఒక సాధారణ మనిషిలా కాకుండా.. ఏదో ఒక అలౌకిక శక్తి మానవ రూపంలో వచ్చి స్క్రీన్‌ను శాసిస్తున్నట్లు అనిపించిందని.. ఆ రోజు ఆ వీడియో పార్లర్ నుండి బయటకు వస్తున్నప్పుడు జాక్సన్ కచ్చితంగా దేవుడు లేదా దేవతలు పంపిన ఒక అద్భుత రూపం అనే భ్రమలో తాను ఉండిపోయానని వర్మ చెప్పుకొచ్చారు.

దర్శకుడిగా తన సినీ ప్రస్థానంలో మైఖేల్ జాక్సన్ సృష్టించిన పాటలే తనకు ఒక కొలమానంగా మారాయని వర్మ వెల్లడించారు. తన కెరీర్‌లో ఏ దర్శకుడితో గానీ... తన టీమ్‌తో గానీ పాటల చిత్రీకరణ గురించి చర్చ వచ్చినప్పుడల్లా బీట్ ఇట్, బిల్లీ జీన్, స్మూత్ క్రిమినల్ వంటి జాక్సన్ ఐకానిక్ వీడియోల గురించే మాట్లాడుకునే వాళ్లమని చెప్పారు. జాక్సన్ చుట్టూ ఉన్న వివాదాలు లేదా స్కాండల్స్ తనను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని.. ఎందుకంటే ఆయన సంగీతం తన ఆత్మకు ఇచ్చిన తృప్తి ముందు ఆ వార్తలన్నీ చాలా చిన్నవని అన్నారు. జాక్సన్ అపారమైన ప్రతిభ తనను ఎల్లప్పుడూ ఇన్‌స్పైర్ చేయడమే కాకుండా... తనలో వినయాన్ని కూడా పెంచిందని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు.

అయితే అంతటి మహోన్నతమైన వ్యక్తిపై తనకు ఎందుకు ద్వేషం కలిగిందో కూడా వర్మ అంతే నిజాయితీగా రాశారు. 25 జూన్ 2009న టీవీ స్క్రీన్‌పై `మైఖేల్ జాక్సన్ మరణించారు` అనే వార్త చూసినప్పుడు అది ఒక పీడకల అని భావించానని... కానీ అన్ని వార్తా ఛానెళ్లలో అదే విషయాన్ని తీవ్రమైన గొంతుతో చెబుతుంటే నమ్మక తప్పలేదని ఆ భయంకరమైన రోజును గుర్తుచేసుకున్నారు. మైఖేల్ జాక్సన్ చనిపోయి తానూ ఒక సాధారణ మనిషినే అని నిరూపించినందుకు... మిగిలిన వారిలాగే ఆయనకు కూడా రక్తం, ఆక్సిజన్ అవసరమయ్యాయని తెలిసి తన ఫాంటసీ (భ్రమ) ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశారు. తన గుండె ఆగిపోయేలా చేసి.. తన కలలను పీడకలలుగా మార్చి జాక్సన్ తనను వెన్నుపోటు పొడిచాడని... అందుకే ఆయనంటే తనకు కోపమని వర్మ వ్యంగ్యంగా భావోద్వేగంతో రాశారు.

మైఖేల్ జాక్సన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయనపై ఉన్న ప్రేమను మాటల్లో వ్యక్తపరచలేనని ఆర్జీవీ ముగించారు. జాక్సన్ ఇప్పుడు ఏ లోకంలో ఉన్నా సరే.. అక్కడ నక్షత్రాలు కూడా తలవంచేలా గెలాక్సీల మధ్య తన అద్భుతమైన `మూన్‌వాక్`' చేస్తూ అంతరిక్ష తుఫానులను సృష్టిస్తుంటాడని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నాడు విజయవాడలోని ఆ చిన్న వీడియో పార్లర్‌లో మైఖేల్ జాక్సన్ తన మనసుపై వేసిన ఆ మాయాజాలపు ముద్ర.. తాను చనిపోయే వరకు తనతోనే ఉంటుందని వర్మ తన లేఖను అత్యంత ఉద్వేగభరితంగా రాసుకొచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu