Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
`ఐబొమ్మ 2.0` ఎవరీ కొత్త మాస్టర్ మైండ్?

`ఐబొమ్మ 2.0` ఎవరీ కొత్త మాస్టర్ మైండ్?

Tupaki.com 1 week ago

తెలుగు సినీ రంగాన్ని ఒణికిస్తోన్న పైరసీ వెబ్‌సైట్ `ఐబొమ్మ` వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇటీవలే ఈ వెబ్‌సైట్ వ్యవహారంలో కీలక సూత్రధారిగా భావించిన రవి అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం, సుదీర్ఘంగా విచారించడం, ఆ తర్వాత అతడు చట్టపరంగా బెయిల్‌పై బయటకు రావడం కూడా జరిగాయి.

అయితే ఈ అరెస్ట్‌తో పైరసీకి అడ్డుకట్ట పడుతుందని ఇండస్ట్రీ భావించినా? రవి బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఐబొమ్మ వెబ్‌సైట్‌లో మళ్లీ కొత్త సినిమాలు హెచ్‌డీ క్వాలిటీతో యధావిధిగా స్ట్రీమింగ్ కావడం టాలీవుడ్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలు ఏమాత్రం ఉపేక్షించకుండా మరింత దూకుడుగా చట్టపరమైన చర్యలకు పూనుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి మరోసారి అధికారికంగా ఫిర్యాదు చేశారు. `ఐబొమ్మ`తో పాటు బప్పం టీవీ అనే సరికొత్త పేరుతో కొత్త సినిమాలను అక్రమంగా ప్రసారం చేస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టాన్ని సైతం అపహాస్యం చేస్తూ ఎలాంటి భయం లేకుండా పైరసీని కొనసాగిస్తున్న నిర్వాహకులపై కఠిన కేసులు నమోదు చేసి వెబ్‌సైట్లను శాశ్వతంగా నిర్వీర్యం చేయాలని కోరారు.

ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు ఈ ఫిర్యాదులో మరో కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. కేవలం సినిమాలను ఉచితంగా చూపించడమే కాకుండా? ఈ సైట్లలో చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్స్ ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారని తెలిపారు. ఉచిత కంటెంట్ ఆశతో సైట్‌లోకి వచ్చే లక్షలాది మంది నెటిజన్లను బెట్టింగ్ ప్రకటనల ద్వారా ఆకర్షించి వారిని ఆర్థిక ఉచ్చుల్లోకి లాగుతున్నారని ఆరోపించారు. ఈ వెబ్‌సైట్ల వెనుక భారీ అంతర్జాతీయ ఫైనాన్షియల్ క్రైమ్ నెట్‌వర్క్ దాగి ఉందని దీనిపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులను కోరారు.

ఈ వివాదంలో మరోసారి ఇమంది రవి పేరు తెరపైకి రావడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా జరుగుతున్న స్ట్రీమింగ్‌కు, ఈ సైట్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఇమంది రవి స్పష్టం చేసినట్లు సమాచారం వస్తోంది. గతంలో జరిగిన అరెస్టులు, తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన తనపై వస్తున్న ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇమంది రవి చెప్తున్న మాటలు ఎంత వరకు నిజం? ఎంత వరకు అబద్ధం? అనే కోణంలో ఇండస్ట్రీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

రవి బెయిల్‌పై వచ్చిన వెంటనే ఐబొమ్మలో యధావిధిగా హెచ్‌డీ స్ట్రీమింగ్ ప్రారంభం కావడంతో.. తాజా స్ట్రీమింగ్‌తో రవికి ఏమైనా సంబంధం ఉందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఒకవేళ పోలీసుల విచారణలో రవి పాత్ర మళ్లీ రుజువైతే ఆయనను పోలీసులు తిరిగి అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాకాకుండా రవి జైలులో ఉన్నప్పుడు , బెయిల్‌పై బయట ఉన్నప్పుడు కూడా సైట్ నిరంతరాయంగా నడుస్తోంది కాబట్టి ఈ నెట్‌వర్క్ వెనుక టెక్నాలజీపై పట్టున్న మరో సరికొత్త మాస్టర్ మైండ్ ఉన్నాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఐబొమ్మ కొత్త స్ట్రీమింగ్ వెనుక పాత క్రిమినల్స్ ఉన్నారా? లేక కొత్త శక్తులు రంగ ప్రవేశం చేశాయా? అనేది ఇకపై సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సిన అంశం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu