Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐటీ ఉద్యోగానికి 'గుడ్‌బై'.. ఆటో డ్రైవర్‌గా మారిన మహిళా టెక్కీ!

ఐటీ ఉద్యోగానికి 'గుడ్‌బై'.. ఆటో డ్రైవర్‌గా మారిన మహిళా టెక్కీ!

Tupaki.com 3 weeks ago

నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఐటీ ఉద్యోగం అంటే అందరికీ ఒక కల. ఐదంకెల జీతం, ఏసీ రూములు, లగ్జరీ లైఫ్.. బయటకు కనిపించే ల్యావిష్ లైఫ్ వెనుక ఉండే అసలు కథ వేరేలా ఉంటుంది.

విపరీతమైన పని ఒత్తిడి, నిరంతర డెడ్‌లైన్లు, మానసిక ఆందోళనలతో నేటి యువత సతమతమవుతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్న ఓ మహిళా ఐటీ మేనేజర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల సాఫ్ట్‌వేర్ కెరీర్‌ను వదిలేసి ఆటో స్టీరింగ్ పట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె సక్సెస్ స్టోరీ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఆశ్చర్యపోయిన ప్రయాణికురాలు.. వెలుగులోకి వచ్చిన కథ!

ఈ ఆసక్తికరమైన విషయాన్ని 'మిధ్లాజ్' అనే మహిళా ఎంట్రప్రెన్యూర్ తన ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఒకరోజు ప్రయాణం కోసం ఆమె సాధారణంగానే ఒక ఆటో ఎక్కారు. అయితే ఆటో నడుపుతోంది ఒక మహిళ కావడంతో ఆమెతో మాటలు కలిపారు. ఈ క్రమంలో సదరు మహిళా డ్రైవర్ చెప్పిన గతం విని మిధ్లాజ్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. "ఆమె సాధారణ ఆటో డ్రైవర్ కాదు.. ఒకప్పుడు కార్పొరేట్ ఆఫీసులో టీమ్‌ను లీడ్ చేసిన ఐటీ మేనేజర్!" అని మిధ్లాజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

లక్షల జీతం ఉన్నా లేని ప్రశాంతత..

ఆ మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె దాదాపు 9 సంవత్సరాల పాటు ఐటీ రంగంలో మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మంచి జీతం, హోదా ఉన్నప్పటికీ.. నిరంతర మానసిక ఒత్తిడి ఆమె జీవితాన్ని భారంగా మార్చేసింది. విపరీతమైన పని ఒత్తిడి...

టైట్ డెడ్‌లైన్స్, వ్యక్తిగత జీవితం లేకపోవడం... ఈ కారణాల వల్ల మానసిక ప్రశాంతత కరువైందని, చివరకు డబ్బు కంటే తన ఆరోగ్యమే ముఖ్యమని భావించి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

ఆటో డ్రైవింగ్‌తో కొత్త జీవితం.. సంపాదన ఎంతంటే?

కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత ఆమె ధైర్యంగా ఆటో డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్నారు. సమాజం ఏమనుకుంటుందో అని అస్సలు సంకోచించలేదు. ప్రస్తుతం ఆమె ఆటో నడుపుతూ నెలకు సుమారు రూ. 60,000 వరకు సంపాదిస్తున్నారు. జీతం గతంతో పోలిస్తే తగ్గినప్పటికీ.. "ఇప్పుడు నేను చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నాను. నా జీవితం నా చేతుల్లోనే ఉంది" అని ఆమె ఎంతో గర్వంగా చెప్తున్నారు.

నెటిజన్ల ప్రశంసల జల్లు

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు సదరు మహిళా డ్రైవర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. "మానసిక ప్రశాంతతను మించిన సంపద మరొకటి లేదు." అని ఒకరు కామెంట్ చేయగా.. "ఉద్యోగం కంటే ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆమె ధైర్యానికి సెల్యూట్" అని మరికొందరు కొనియాడారు.

అయితే ఈమె ఏ నగరంలో ఆటో నడుపుతున్నారనే వివరాలు వీడియోలో స్పష్టంగా వెల్లడించనప్పటికీ ఆమె తీసుకున్న నిర్ణయం మాత్రం లక్షల మందికి స్ఫూర్తినిస్తోంది. విజయం అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు.. జీవితంలో ఉండే సంతృప్తి, సంతోషం అని ఆమె మరోసారి నిరూపించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu