Dailyhunt
అమరావతి వేడుక చేద్దాం.. ప్రభుత్వం భారీ సన్నాహాలు

అమరావతి వేడుక చేద్దాం.. ప్రభుత్వం భారీ సన్నాహాలు

Tupaki.com 2 weeks ago

రాజధాని అమరావతి చట్టబద్ధతకు పార్లమెంట్ లోని ఉభయ సభలు ఆమోదించడాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయాలని పిలుపునిచ్చింది. రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ జరగడానికి కొద్ది సేపటి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి పార్టీల నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇందులో జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎన్వీ మాధవ్ పాల్గొన్నారు. రాజధాని అమరావతికి తగిన గుర్తింపు లభించినందుకు గాను ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. మంత్రి నారా లోకేశ్ సైతం ఢిల్లీ నుంచి రాజధాని సంబరాలు ఘనంగా నిర్వహించాలని ప్రజలను కోరారు.

అమరావతి బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో రాజధానికి పట్టిన గ్రహణం వీడిందని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకోవాలని లోకేశ్ సూచించారు. ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రాజధానిపై బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేయడాన్ని గొప్పగా కీర్తిస్తూ ప్రతి ఇంటి ముందు సాయంత్రం 7 గంటలకు దీపాలు వెలిగించాలని మంత్రి లోకేశ్ కోరారు.

ఇక చారిత్రక సందర్భాన్ని ఎప్పటికి మరచిపోకుండా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని సూచిస్తూ అన్ని జిల్లాలకు సర్య్కులర్ జారీ చేసింది. రాత్రి 7 గంటలకు ఇళ్ల ముందు దీపాలు వెలిగించేలా మహిళలను ప్రోత్సహించాలని సూచించడంతోపాటు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా దేవాలయాలు, ప్రార్థనా మందిరాలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించాలని ప్రభుత్వం కోరింది.

బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన విషయాన్ని వివరిస్తూ స్కూళ్లు, కాలేజీల్లో కేక్ కటింగ్ చేయాలని, విద్యార్థులకు ఆటల పోటీలు పెట్టాలని కోరింది. స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే ఉత్సవాలకు అలంకరించినట్లు ప్రభుత్వ కార్యాలయాలను అలంకరించాలని సూచిస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్అండ్బీ అధికారులకు ప్రభుత్వం సూచించింది. అదేవిధంగా సోషల్ మీడియాలోనూ అమరావతికి శాశ్వత గుర్తింపు లభించడంపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ థ్యాంక్స్ ఇండియా అన్న హ్యాష్ ట్యాగ్ తో వీడియోలు, పోస్టర్లు వైరల్ చేయాలని ఆదేశించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu