Dailyhunt
అమరావతిపై చర్చ..  రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి సంచలన వ్యాఖ్యలు

అమరావతిపై చర్చ.. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి సంచలన వ్యాఖ్యలు

Tupaki.com 1 week ago

రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 12 ఏళ్ల నాటి విభజన చట్టంపై ఇప్పుడు చర్చ జరగడం దురదృష్టకరమని, గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాజధానిలేని రాష్ట్రంగా ఇన్నాళ్లు ఏపీ అవమానాలు ఎదుర్కొందని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు.

ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలన చర్చకు దారితీశాయి. అమరావతి, కమ్మరావతి అంటూ మాట్లాడారని అమరావతి పేరు పెట్టడానికి ఇబ్బంది అయితే పిలవరా కమ్మరావతి అంటూ తాను గత సీఎంకు సూచించాని రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు.

అమరావతి, కమ్మరావతి అంటూ గత ప్రభుత్వం చేసిన విమర్శలపై కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై తొలిగా మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి విభజన చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని విమర్శలు గుప్పించారు. రాజధాని అమరావతితో సహా విభజన హామీల అమలు చేయలేదని విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఇప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.

ఇక రాజధాని అమరావతిని సమర్థిస్తున్నట్లు రేణుకా చౌదరి ప్రకటించారు. ఇది అమరావతి రైతులు, మహిళల విజయంగా అభివర్ణించారు. 12 ఏళ్లపాటు రాజధానిపై నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఏపీ చాలా నష్టపోయిందని అన్నారు. పెట్టుబడులకు తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఒక్క రాజధాని లేకుండా చేసిందని ఆరోపించారు. రాజధానిని కాపాడుకునేందుకు భూములు ఇచ్చిన రైతులు, మహిళలు రెండేళ్లు పోరాడారని పోలీసులు కేసులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు.

రాజ్యసభలో కాంగ్రెస్ తరఫున మాట్లాడిన రేణుకా చౌదరి తెలంగాణ గొంతు వినిపిస్తూనే విపక్షంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విభజన చట్టానికి చేస్తున్న సవరణను స్వాగతించారు. అమరావతికి మద్దతు చెబుతూనే ఆమె గత ప్రభుత్వాన్ని దుయ్యబట్టిన తీరు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు ప్రస్తావించకుండా, తెలుగు వారు అందరికీ అర్థమయ్యేలా తన ప్రసంగంలో జగన్ పై తెలుగులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేణుకా చౌదరి. కాగా, రాజ్యసభలో అమరావతిపై చర్చ జరుగుతుండగా, ఏపీలో సంబరాలు చేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. రాజధాని ప్రాంతంలో రైతులు, మహిళలు మిఠాయిలు పంచుకుని వేడుకలు చేసుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu