Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అన్నపూర్ణ స్టూడియోస్‌లో కాలేజీ విద్యార్థులతో దుల్కర్ గేమ్

అన్నపూర్ణ స్టూడియోస్‌లో కాలేజీ విద్యార్థులతో దుల్కర్ గేమ్

Tupaki.com 1 week ago

ర్సటైల్ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన `ఐమ్ గేమ్` చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దుల్కర్ వేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

తాము నిర్మించిన ప్రాజెక్ట్‌లలో ఇది అత్యంత భారీ చిత్రమని.. ఓటీటీ సంస్థలతో మాట్లాడినప్పుడు కూడా ఇదొక పెద్ద స్ట్రెయిట్ తెలుగు సినిమా లాంటిదని గర్వంగా చెప్పానని ఆయన వెల్లడించారు. ట్రైలర్‌లో తాము అన్ని విషయాలను బయటపెట్టలేదని...సినిమాలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అనేక అంశాలు దాగి ఉన్నాయని స్పష్టం చేశారు.

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమాభిమానాల గురించి దుల్కర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వేదికపై ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నాగార్జున, చిరంజీవి వంటి ఏ కథానాయకుడి పేరు విన్నా అభిమానుల్లో కనిపించే ఉత్సాహం అద్భుతమని కొనియాడారు. తాను మలయాళం, తమిళం లేదా హిందీ భాషల్లో ఏ సినిమా తీసుకువచ్చినా.. తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ తమ హృదయాల్లో స్థానం కల్పిస్తారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం నేరుగా స్వయంగా తెలుగు డబ్బింగ్ చెప్పానని... దర్శకుడు నాగ్ అశ్విన్ (నాగి) కూడా సినిమా చూసి ఎడిటింగ్‌లో సహాయం అందించారని తెలిపారు.

తన కెరీర్‌లో `మహానటి` చిత్రం అత్యంత కీలకమైనదని దుల్కర్ గుర్తుచేసుకున్నారు. మొదట్లో తనకు తెలుగు రాదని.. ప్రేక్షకులు ఏమనుకుంటారో అని భయపడినప్పుడు నాగ్ అశ్విన్, స్వప్న దత్ దంపతులు తనకు ధైర్యం చెప్పి తెలుగు నేర్పించారని వివరించారు. నేడు తాను తెలుగులో ఈ స్థాయిలో నిలబడటానికి వైజయంతీ మూవీస్ బృందమే ముఖ్య కారణమని... హైదరాబాద్‌లో వారిని తన సొంత కుటుంబంగా భావిస్తానని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ చిత్రం తర్వాత తన నుంచి వెంటనే రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు రాబోతున్నాయని ప్రకటించి అభిమానులకు తీపి కబురు అందించారు.

ఈవెంట్లో భాగంగా జరిగిన సరదా ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో తన వ్యక్తిగత అభిరుచులను షేర్ చేసారు. తన తండ్రి (మమ్మూట్టి) నటించిన సినిమాల్లో `దళపతి` తనకి అత్యంత ఇష్టమైన చిత్రమని వెల్లడించారు. విద్యార్థిగా కాలేజీ రోజులకు వెళ్లేటప్పుడు తన వెంట తీసుకెళ్లిన ఏకైక డివిడి `దళపతి` మాత్రమే అని, తండ్రి జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా ఆ సినిమానే చూసేవాడినని తెలిపారు. ఇక తనకు అత్యంత ఇష్టమైన ఆహారం ఏదనే ప్రశ్నకు స్పందిస్తూ.. హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ప్రాణమని.. తాను గొప్ప బిర్యానీ ప్రేమికుడిని అని చమత్కరించారు.

`ఐమ్ గేమ్`చిత్రం సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని... ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందనే ధీమాను దుల్కర్ వ్యక్తం చేశారు. చిత్రంలో భాగమైన ఇతర నటీనటులను కూడా ప్రేక్షకులకు పరిచయం చేస్తూ.. ఈ ఈవెంట్‌ను విజయవంతం చేసిన అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సినిమాపై తనకున్న అంకితభావం.. తెలుగు ప్రేక్షకుల విషయంలో ఉన్న కృతజ్ఞత దుల్కర్ మాటల్లో స్పష్టంగా కనిపించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu