Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అప్పు ఇచ్చి మరీ చనిపోయింది.. సినిమాలకు మించిన ఈ క్రైం కథ

అప్పు ఇచ్చి మరీ చనిపోయింది.. సినిమాలకు మించిన ఈ క్రైం కథ

Tupaki.com 3 weeks ago

ఆంధ్రప్రదేశ్‌లో మనీ రొటేషన్, అధిక వడ్డీ ఆశ చూపి చేసిన ఒక దారుణ హత్య రెండు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలానికి చెందిన మూడమంచు ఆదిలక్ష్మి (32) అనే మహిళను ఆమె సమీప బంధువే అత్యంత కిరాతకంగా హత్య చేసి..

మృతదేహాన్ని ప్లాస్టిక్ డబ్బాలో కుక్కి పంట పొలంలో పాతిపెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

లక్షకు లక్ష ఇస్తానని నమ్మించి..

పెద్దారవీడు మండలం ప్రగల్లపాడు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మికి, అర్థవీడు మండలం వీరభద్రాపురంలో ఉన్న బంధువుతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. రూ. లక్ష పెట్టుబడి పెడితే రూ. లక్ష అదనంగా ఇస్తానని ఆశ చూపడంతో ఆదిలక్ష్మి ఆమెను నమ్మింది. మొదట్లో చెప్పినట్లే రెట్టింపు డబ్బులు చెల్లించడంతో ఆదిలక్ష్మికి ఆ మహిళపై పూర్తి నమ్మకం ఏర్పడింది. దాంతో తన ఇంట్లోని నగలు అమ్మడంతో పాటు.. భర్త బాలగురవయ్య వద్దంటున్నా వినకుండా బయట అప్పులు చేసి మరీ ఏకంగా రూ. 50 లక్షల వరకు సదరు మహిళకు ఇచ్చింది.

డబ్బులు తిరిగడిగితే దారుణ హత్య

కొంతకాలం తర్వాత ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా ఆదిలక్ష్మి ఒత్తిడి తెచ్చింది. డబ్బులు ఇచ్చే ఉద్దేశం లేకపోవడంతో నిందితురాలు ఆమెను అంతమొందించాలని పథకం వేసింది. ఈ ఏడాది జూన్‌లో బాకీ తీరుస్తానని నమ్మించి ఆదిలక్ష్మిని తన ఇంటికి పిలిపించింది. అక్కడ ఆమెకు మత్తు పానీయం ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి ఆపై గొంతు నులిమి కిరాతకంగా హత్య చేసింది. సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకు మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కుక్కి.. గ్రామానికి సమీపంలోని ఎర్రకొండ దగ్గర ఉన్న పంట పొలంలో పాతిపెట్టింది. ఆదిలక్ష్మి ఫోన్‌ను పక్కనే ఉన్న కుంటలో పడేసింది.

కాల్ డేటాతో బయటపడ్డ నిజాలు

భార్య కనిపించకపోవడంతో జూన్ 24న భర్త బాలగురవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆదిలక్ష్మి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించగా చివరి లొకేషన్ వీరభద్రాపురంలో చూపించింది. దీంతో నిందితురాలితో పాటు ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది.

పోలీసులు గురువారం నిందితురాలు చూపించిన ప్రదేశంలో తవ్వకాలు జరిపి మృతదేహ ఆనవాళ్లను గుర్తించారు. ఫోరెన్సిక్ బృందం సమక్షంలో పూర్తిస్థాయి ఆధారాలు సేకరిస్తున్నారు. కాగా, ఈ నిందితురాలు మరో ఇద్దరి నుంచి కూడా రూ. 60 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అధిక వడ్డీల పేరుతో వచ్చే మోసపూరిత ఆఫర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu