Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారతదేశ పసిడితో సవాళ్లు: 450 లక్షల కోట్ల బంగారంతో ఆదాయం జీరో!

భారతదేశ పసిడితో సవాళ్లు: 450 లక్షల కోట్ల బంగారంతో ఆదాయం జీరో!

Tupaki.com 5 days ago

భారతదేశంలో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు.. అది తరతరాలుగా కొనసాగుతున్న ఆచారాలు, సంస్కృతి , సెంటిమెంట్ .. నమ్మకమైన కరెన్సీ. ఇటీవల పాపులర్ సర్వేల ప్రకారం..

దేశంలోని గృహాల వద్ద ప్రస్తుతం ఏకంగా 35,000 టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం దీని విలువ సుమారు రూ.450 లక్షల కోట్లు. అంటే సుమారు ఈ విలువ 5 ట్రిలియన్ డాలర్లకు సమానం. ప్రజల వద్ద ఉన్న ఈ బంగారపు నిధుల విలువ దేశ ప్రజల మొత్తం జీడీపీ అయిన రూ.370 లక్షల కోట్లు కంటే చాలా ఎక్కువ. జర్మనీ, జపాన్ వంటి అగ్ర దేశాల వార్షిక ఆర్థిక ఉత్పత్తులతో పోటీపడుతున్న ఈ అపార సంపద అంతా ప్రభుత్వాల వద్ద కాకుండా నేరుగా పౌరుల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండటం గమనార్హం.

భారతీయ గృహాలు, దేవాలయాలు కలుపుకుని ఏకంగా 30,000 టన్నులకు పైగా బంగారాన్ని కలిగి ఉండగా, కేవలం దేవాలయాలకు దాదాపు 4,000 - 5000 టన్నుల బంగారం ఉందని అంచనా. కేవలం భారతీయుల ఇండ్లలోనే 25000 టన్నుల బంగారం చిక్కుకుపోవడం ఇప్పుడు రూపాయి విలువ పడిపోవడంలో కీలక పాత్రను పోషిస్తోందనేది నిజంగా షాకిస్తోంది. భారతీయుల వద్ద ఉన్న బంగారంతో పోలిస్తే, అమెరికా వద్ద అధికారికంగా 8931 టన్నుల బంగారు నిల్వలు మాత్రమే ఉన్నాయి. అక్కడ తయారీ రంగం చాలా అడ్వాన్స్ డ్ స్టేజ్ లో ఉండటానికి పెట్టుబడుల వెల్లువ ఒక కారణం. కానీ భారతదేశంలో బంగారం ఉన్నట్టు డబ్బు లభ్యత లేకపోవడం ప్రధాన సమస్య.

వెస్ట్రన్ దేశాలలో అస్సెట్స్ (స్థిరాస్తులు వగైరా) రేట్లు పెరిగినప్పుడు ప్రజలు ఖర్చుచేసే వైనం పెరుగుతుంది. దీనినే ఆర్థిక శాస్త్రంలో `వెల్త్ ఎఫెక్ట్` అంటారు. అయితే ఈ సిద్ధాంతం భారతదేశంలో అస్సలు పని చేయదు. ఎందుకంటే భారతీయులు బంగారాన్ని కేవలం ఒక ట్రేడింగ్ వస్తువుగా కాకుండా.. కష్టకాలంలో ఆదుకునే కుటుంబ శాశ్వత మూలధనంగా భావిస్తారు. సామాజిక హోదా.. సాంప్రదాయ ఆచారాలు, వివాహ బేరసారాలలో పసిడి ఒక తప్పనిసరి వస్తువుగా మారడం వల్ల ధరలు ఎంత పెరిగినా.. ప్రజలు దీనిని విక్రయించడానికి ఇష్టపడరు. ఫలితంగా అంతర్జాతీయంగా అమెరికా-చైనా శత్రుత్వం లేదా మిడిల్ ఈస్ట్ సంక్షోభాల వల్ల బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నా.. దేశీయంగా మాత్రం ఆ సంపద ద్రవ్యం(డబ్బు) రూపంలోకి మారడం లేదు.

ప్రజల పసిడి వ్యామోహం భారత ఆర్థిక వ్యవస్థకు ఒక విచిత్రమైన సంకట స్థితిని తెచ్చిపెట్టింది. పౌరుల వద్ద కాగితంపై అపారమైన సంపద కనిపిస్తున్నా.. అది ఇళ్లలో లాకర్లలో పనికి రాని ఆస్తిగా మూలన పడి ఉంది. ఈ బంగారం వల్ల ఎలాంటి అదనపు ఆదాయం, ఉపాధి లేదా డివిడెండ్లు లభించవు సరి కదా.. దేశీయ అవసరాల కోసం ఏటా భారీగా జరుగుతున్న పసిడి దిగుమతుల వల్ల దేశ కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) విపరీతంగా పెరుగుతోంది. ఇది దేశీయ కరెన్సీ అయిన రూపాయి స్థిరత్వంపై నిరంతరం తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. గృహాలలో నిలిచిపోయిన ఈ బంగారాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్‌.జీ.బీలు).. అలాగే గోల్డ్ మానిటైజేషన్ వంటి పథకాలు కూడా ఆశించిన స్థాయిలో ప్రజాదరణ పొందలేకపోయాయి.

ఆసక్తికరమైన విషయమేమిటంటే.. డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి బయటపడటానికి లేదా డీ డాలరైజేషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ప్రయత్నాలలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా పసిడి నిల్వలను పెంచుకునే వ్యూహాన్ని అమలు చేస్తోంది. కేవలం 2024లోనే ఆర్బీఐ తన నిల్వలను 75 టన్నులు పెంచుకుని మొత్తం 880 టన్నులకు చేర్చింది. 150 కోట్ల మంది జనాభా పైబడిన దేశాల ప్రభుత్వాలే బంగారం నిల్వలను పెంచుకుంటే అది బ్రిక్స్ దేశాల ఆధ్వర్యంలో డాలర్ కు వ్యతిరేకంగా ఇతర వాణిజ్య మార్గాలకు తెర తీస్తుంది. రక్షణ పరంగా ఈ వ్యూహం బాగున్నా కానీ.. దేశీయంగా మాత్రం పెట్టుబడి కొరత అనే సమస్యను ఇది పరిష్కరించలేకపోతోంది.

భారతదేశం త్వరలోనే 10 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక మైలురాయిని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే ఇళ్లలో దాచిపెట్టిన ఈ పసిడి సంపదను పెట్టుబడిగా మార్చడం అత్యంత అవసరం. కేవలం 10 శాతం గృహ బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి లిక్విడిటీ రూపంలోకి తీసుకురాగలిగితే.. దేశంలో ఏకంగా 45 లక్షల కోట్ల అదనపు పెట్టుబడి మూలధనం అందుబాటులోకి వస్తుంది. ఈ భారీ నిధులు గనుక మార్కెట్లోకి వస్తే మౌలిక వసతుల కల్పన వేగవంతం అవ్వడమే కాకుండా.. తయారీ - ఎంఎస్ఎమ్ఈ రంగాలకు కొండంత అండ లభిస్తుంది. సంపద ఉండి కూడా ద్రవ్యం(డబ్బు) లేక సగం సామర్థ్యంతో నడుస్తున్న భారత ఆర్థిక వృద్ధి ఇంజన్ వేగం పుంజుకోవాలంటే ఈ నిష్ఫలంగా పడి ఉన్న పసిడి నిధులను అన్‌లాక్ చేయడం ఒక్కటే ఏకైక మార్గం.

డాలర్ విలువను తగ్గించలేనంత కాలం అమెరికా అగ్రరాజ్యంగా కొనసాగుతుంది. రూపాయి విలువ పెరగనంత కాలం భారతదేశం ఇంకా పేదరికంతో సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంటుంది. ఈ చైన్ సిస్టమ్ ని బ్రేక్ చేసేందుకు భారతీయులు బంగారాన్ని బయటకు తీయడం ఒక్కటే మార్గమనే విశ్లేషణలు సాగుతున్నాయి. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులు బంగారం కొనుగోళ్లను తగ్గించమని బహిరంగంగా అభ్యర్థించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu