Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బుచ్చిబాబు చెప్పిన మాటకు షాకైన ఫైట్ మాస్టర్

బుచ్చిబాబు చెప్పిన మాటకు షాకైన ఫైట్ మాస్టర్

Tupaki.com 1 week ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుచ్చిబాబు ఈ సినిమాను కేవలం ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా కాకుండా, భావోద్వేగాలు, మాస్ ఎలివేషన్స్, రియలిస్టిక్ టచ్ కలిసిన ప్రత్యేకమైన అనుభూతిగా తీర్చిదిద్దారని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

ప్రముఖ ఫైట్ కొరియోగ్రాఫర్ నభ కాంత్ తన తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ బుచ్చిబాబు గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా పెద్ది ఇంట్రో సీన్ వెనుక ఉన్న ఆలోచన, ఆ సీన్ డిజైన్ చేసిన విధానం గురించి ఆయన చెప్పిన విషయాలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. నభకాంత్ వెల్లడించిన వివరాల ప్రకారం, బుచ్చిబాబు పెద్ది హీరో ఇంట్రో సీన్ గురించి తనకు పుష్ప2 టైమ్ లోనే చెప్పినట్టు చెప్పారు. అయితే అది సాధారణ యాక్షన్ సీన్ కాదని, కానీ ప్రేక్షకులకు యాక్షన్ ఫీల్ వచ్చేలా ఉండాలని బుచ్చి తనను కోరినట్లు తెలిపారు. "అది యాక్షన్ సీన్ కాదు… కానీ యాక్షన్ ఫీల్ ఇవ్వాలి" అని బుచ్చిబాబు చెప్పిన మాట తనకు మొదట షాక్ ఇచ్చిందని నభకాంత్ పేర్కొన్నారు.

తర్వాత ఆ ఆలోచన ఆధారంగానే గ్లింప్స్‌లో కనిపించిన ప్రత్యేకమైన బ్యాటింగ్ స్టైల్ షాట్‌ను డిజైన్ చేశానని చెప్పారు. ఆ షాట్ విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా వైరల్ అయిందని, సోషల్ మీడియాలో లక్షలాది వ్యూస్ సంపాదించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే ఆ సక్సెస్ లో బుచ్చిబాబు ఆ షాట్ మొత్తం క్రెడిట్‌ను తనకే ఇచ్చారని నభకాంత్ భావోద్వేగంగా చెప్పారు. ఆయనకు నిజంగా చాలా మంచి మనసు ఉందంటూ నభ కాంత్, డైరెక్టర్ వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతూ, బుచ్చిబాబు టీమ్‌ను ఎలా ప్రోత్సహిస్తారో మరోసారి చాటుతున్నాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇండస్ట్రీలో డైరెక్టర్లు సాధారణంగా సినిమా విజయానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంటారు. కానీ బుచ్చిబాబు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయనతో పని చేసిన పలువురు టెక్నీషియన్స్ చెబుతున్నారు. ఫైట్ మాస్టర్స్ నుంచి సినిమాటోగ్రాఫర్స్ వరకు, అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వరకు ప్రతి ఒక్కరి కష్టాన్ని ఆయన పబ్లిక్‌గా గుర్తిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా తన ఇంటర్వ్యూల్లో సినిమా బాగా రావడానికి టీమ్ ఎఫర్ట్స్ కారణమని చెప్పడం, ఒక్కరికే క్రెడిట్ తీసుకోకుండా అందరినీ మెచ్చుకోవడం ఇండస్ట్రీలో ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఈ కారణంగానే పెద్ది సినిమా చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్‌తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా, చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu