Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బుచ్చిబాబు 'పెద్ది'.. ఇన్స్పిరేషన్ 'గల్లీ' క్రికెటరా?

బుచ్చిబాబు 'పెద్ది'.. ఇన్స్పిరేషన్ 'గల్లీ' క్రికెటరా?

Tupaki.com 1 week ago

ప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఊరమాస్ లుక్‌ లో కనిపించనున్న ఆ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే తాజాగా దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పెద్ది కథకు ఓ గల్లీ క్రికెటరే ఇన్స్పిరేషన్ అని వెల్లడించారు.

సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన బుచ్చిబాబు.. "మా ఊరిలో పెద్ది రాజు అనే ఓ కుర్రాడు ఉండేవాడు. కూలీ పనికి వెళ్లేవాడు. కానీ క్రికెట్ మాత్రం అద్భుతంగా ఆడేవాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌ మన్. అతడు షాట్ కొడితే ఫ్యూజులు ఎగిరిపోయేవి. పనికి వెళ్లొద్దని డబ్బులు ఇచ్చి అయినా క్రికెట్ ఆడించే వాళ్లం. ఈవెనింగ్ బాస్కెట్‌ బాల్ కూడా ఆడేవాడు. ఏ మ్యాచ్ అయినా ఒక్కడే గెలిపించే స్థాయిలో ఉండేవాడు" అంటూ గుర్తు చేసుకున్నారు.

అలాంటి వ్యక్తిత్వం ఉన్న ఆ యువకుడి పాత్ర తనను ఆకట్టుకుందని, దాదాపు 10 నుంచి 15 ఏళ్ల క్రితమే ఆ క్యారెక్టర్‌ ను కథగా మలచాలనుకున్నానని తెలిపారు. ఆ ఆలోచనే తర్వాత సినిమాగా రూపుదిద్దుకుందని చెప్పారు. వలస కూలీల జీవితాలను కూడా కథలో భాగం చేసినట్లు వెల్లడించారు. దీంతో ఆ చిత్రం కేవలం స్పోర్ట్స్ డ్రామాగా కాకుండా భావోద్వేగాలతో కూడిన మాస్ ఎంటర్టైనర్‌ గా ఉండబోతుందనే అంచనాలు పెరిగాయి.

ఇక ఆ కథ రూపుదిద్దుకున్న విధానాన్ని కూడా బుచ్చిబాబు వివరించారు. కరోనా సమయంలో తన తొలి చిత్రం ఉప్పెనను ఓటీటీలో విడుదల చేయాలనే చర్చలు జరిగాయని చెప్పారు. అదే సమయంలో దర్శకుడు సుకుమార్ తదుపరి ప్రాజెక్ట్ గురించి అడగడంతో పెద్ది కథ పాయింట్ చెప్పినట్లు తెలిపారు. ఆ కథ కొత్తగా ఉందని సుకుమార్ వెంటనే అభినందించి, దానిపై పూర్తి స్థాయిలో వర్క్ చేయమని ప్రోత్సహించారని పేర్కొన్నారు.

అయితే ఉప్పెన విడుదలకు ముందే పిఠాపురంలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో ఈ కథ రాయడం ప్రారంభించానని, తర్వాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద కూర్చుని స్క్రిప్ట్ పూర్తి చేశానని చెప్పారు. ముఖ్యంగా చరణ్ తన కథలో ఎలాంటి మార్పులు చెప్పకుండా ఒప్పుకోవాలని దేవుణ్ని ప్రార్థించానని, అదే జరిగిందని తెలిపారు.

ఇక చిత్రంలో రామ్ చరణ్ రెజ్లర్‌తో పాటు క్రికెటర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అభిమానులను ఆకట్టుకోగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ భారీ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంతకంటే ముందు జూన్ 3న ప్రీమియర్ షోలు వేయనున్నారు. మరోవైపు సోమవారం విడుదల కానున్న ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. రియల్ లైఫ్ లోని ఓ సాధారణ గల్లీ క్రికెటర్ నుంచి పుట్టిన ఆ స్టోరీ.. సిల్వర్ స్క్రీన్ పై ఎంతటి సంచలనం సృష్టిస్తుందో అంతా వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu