Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చరణ్ డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా! సపోర్ట్ బ్రేస్ తోనే ప్రమోషన్స్‌కు

చరణ్ డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా! సపోర్ట్ బ్రేస్ తోనే ప్రమోషన్స్‌కు

Tupaki.com 1 week ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత కీలకమైన దశను ఎదుర్కొంటున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ ఛేంజర్ ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో, ఇప్పుడు ఆయన ఆశలన్నీ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా పెద్దిపైనే ఉన్నాయి.

గ్రామీణ నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం చరణ్ అసాధారణమైన కష్టాన్ని పడుతున్నారనే విషయం తాజాగా మరోసారి స్పష్టమైంది. చేతికి గాయం అయినప్పటికీ ప్రమోషన్స్‌ను ఆపకుండా ముందుకు సాగుతున్న తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమవుతున్న పెద్ది కోసం మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేయగా, ఆ కార్యక్రమం కోసం ఇప్పటికే చరణ్ ముంబై చేరుకున్నారు. అక్కడ ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ హకీం ఆలిం సెలూన్‌కు వెళ్లిన సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే ఆ ఫోటోలు, వీడియోల్లో అభిమానుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన విషయం ఆయన కుడిచేతికి ఉన్న సపోర్ట్ బ్రేస్. దీంతో చరణ్‌కు ఏమైందనే ఆందోళన వెంటనే మొదలైంది. పెద్ది షూటింగ్ సమయంలో స్వల్ప గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ఆయన చేతికి బ్యాండేజ్ ధరించినట్లు సమాచారం. అయినప్పటికీ రెస్ట్ తీసుకోకుండా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొనడం ఆయన డెడికేషన్‌కు నిదర్శనంగా అభిమానులు భావిస్తున్నారు.

ఇది చరణ్‌కు షూటింగ్ సమయంలో జరిగిన తొలి గాయం కాదు. ఆల్రెడీ పెద్ది షూటింగ్ లో భాగంగా ఆయన కంటికి గాయమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి సెట్స్‌పైకి వచ్చి షూటింగ్ కొనసాగించారు. అంతకుముందు జిమ్ వర్కౌట్స్ సమయంలోనూ, గతంలో చికిరి సాంగ్ షూటింగ్ టైమ్‌లోనూ ఆయన గాయపడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రతి సారి చరణ్, పనిపట్ల తన నిబద్ధతను ముందుంచుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొంటూనే వచ్చారు. ఇప్పుడు కూడా చేతికి గాయం ఉన్నా, పెద్ది ప్రమోషన్స్‌ను ఆపకుండా దేశవ్యాప్తంగా ఈవెంట్స్‌కు హాజరు కాబోతుండటం అభిమానుల్లో అతనిపై మరింత గౌరవాన్ని పెంచుతోంది.

ఇక పెద్ది సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, విజి చంద్రశేఖర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత A. R. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, మేకింగ్ వీడియోలకు మంచి స్పందన రావడంతో, ఇప్పుడు ట్రైలర్‌పై మరింత హైప్ నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu