Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చివరి 20 నిమిషాల్లో చరణ్ విశ్వరూపం.. పెద్ది గురించి బుచ్చిబాబు!

చివరి 20 నిమిషాల్లో చరణ్ విశ్వరూపం.. పెద్ది గురించి బుచ్చిబాబు!

Tupaki.com 1 week ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా పెద్దిపై అంచనాలు రోజు రోజుకీ కొత్త స్థాయికి చేరుకుంటున్నాయి. డైరెక్టర్ బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ డ్రామా ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌తో సోషల్ మీడియాలో సంచలన హైప్‌ను సృష్టించింది.

జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమాపై తాజాగా డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

ముఖ్యంగా రామ్ చరణ్ పాత్ర గురించి బుచ్చిబాబు చెప్పిన మాటలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మొదటి 20 నిమిషాల తర్వాత నుంచి సినిమాలో రామ్ చరణ్ కనిపించడని, కేవలం పెద్ది మాత్రమే కనిపిస్తాడంటూ ఆయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఒక్క మాటతోనే బుచ్చిబాబు సినిమాలో చరణ్ పాత్రను ఎంత బలంగా, డెప్త్ గా డిజైన్ చేశారో అర్థమవుతుంది.

ఇక ఈ సినిమా ఫైనల్ కట్ రన్‌టైమ్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తం 3 గంటల 2 నిమిషాల నిడివితో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని బుచ్చిబాబు వెల్లడించాడు. ముఖ్యంగా చివరి 20 నిమిషాల్లో రామ్ చరణ్ నటన అద్భుత స్థాయిలో ఉంటుందని, ఆ ఎమోషనల్ పీక్ ఈ సినిమాకే హైలైట్ అవుతుందని చెప్పడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. పైగా ఈ సినిమా క్రెడిట్ మొత్తం చరణ్‌దే అని డైరెక్టర్ చెప్పడం అతని మంచితనానికి నిదర్శనంగా చెప్పొచ్చు.

సాధారణంగా డైరెక్టర్లు, హీరోలపై ప్రశంసలు కురిపించడం కామన్ అయినప్పటికీ, ఒక దర్శకుడు సినిమా మొత్తం భారాన్ని హీరో భుజాలపై నమ్మకంగా ఉంచడం అరుదైన విషయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే షూటింగ్ టైమ్ లో పలువురు టెక్నీషియన్స్, యూనిట్ సభ్యులు చరణ్ నటనపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. గ్రామీణ బ్యాక్‌డ్రాప్, రగ్డ్ లుక్, మాస్ బాడీ లాంగ్వేజ్‌తో చరణ్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త అవతారంలో కనిపించి అలరించనున్నారు.

అయితే పెద్దిపై అంచనాలు ఇంతలా పెరగడానికి మరో ముఖ్య కారణం డైరెక్టర్ సుకుమార్ చేసిన కామెంట్స్. ఇటీవల ఓ సందర్భంలో సుకుమార్ మాట్లాడుతూ, రంగస్థలం తర్వాత చరణ్ కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ పెద్దిలో చూస్తారని చెప్పిన విషయం తెలిసిందే. చరణ్ యాక్టింగ్ లో రంగస్థలంను ఇప్పటికీ ఒక మైలురాయిగా భావిస్తుంటారు ఆడియన్స్. అలాంటి సినిమాను మించే స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఉంటుందని ఇండస్ట్రీలోనే అత్యంత గౌరవం పొందిన సుకుమార్ లాంటి డైరెక్టర్ చెప్పడం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇప్పటికే యూఎస్ మార్కెట్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌పై మంచి రెస్పాన్స్ వస్తుండగా, ట్రేడ్ వర్గాలు ఈ సినిమాను 2026లో అతిపెద్ద ఓపెనింగ్స్ అందుకునే సినిమాల్లో ఒకటిగా అంచనా వేస్తున్నాయి. రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ పెద్ది హంగామా మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu