Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈసారి దర్శిలో గొట్టిపాటి లక్ష్మికి ఛాన్స్ ఉందా... !

ఈసారి దర్శిలో గొట్టిపాటి లక్ష్మికి ఛాన్స్ ఉందా... !

Tupaki.com 1 week ago

గొట్టిపాటి లక్ష్మి. గత ఎన్నికల సమయంలో దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలైన టిడిపి నాయకురాలు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన లక్ష్మి స్థానికంగానే వైద్యశాలను నడుపుతున్నారు.

గత ఎన్నికల సమయంలో ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చి రావడంతోనే స్థానికంగా బలమైన హవాను సృష్టించగలిగారు. సీనియర్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి బలమైన ప్రత్యర్థిగా మారారు.

వాస్తవానికి బూచేపల్లి కుటుంబానికి దర్శి నియోజకవర్గంలో బలమైన రాజకీయ ప్రస్థానం ఉంది. బూచేపల్లి శివప్రసాద్ మాతృమూర్తి బూచేపల్లి వెంకాయమ్మ జడ్పిటిసి చైర్మన్గా కూడా ఉన్నారు. ప్రస్తుతం జడ్పిటిసి రద్దయిన నేపథ్యంలో ఈ పదవికి ప్రాధాన్యం తగ్గినప్పటికీ గత ఎన్నికల సమయంలో బూచేపల్లి మాతృమూర్తి చైర్మన్ గా వ్యవహరించారు. అయినప్పటికీ గొట్టిపాటి లక్ష్మి బలమైన ప్రచారం చేశారు. బలమైన ఓటు బ్యాంకును సాధించగలిగారు. కేవలం 1800 నుంచి 2000 ఓట్ల మధ్య తేడాతో ఆమె పరాజయం పాలయ్యారు.

అయితే వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆమె ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలను తరచుగా కలుస్తున్నారు. కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఒకవైపు పార్టీ కార్యక్రమాలతో పాటు మరోవైపు స్వచ్ఛంద సంస్థలతో కలిసి వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రక్తదాన శిబిరాలను, అదేవిధంగా ఇతర ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి గ్రామీణ, మండల స్థాయిలో ప్రజలకు లక్ష్మి పరిచయం అవుతున్నారు. తద్వారా వచ్చే ఎన్నికలనాటికే మరింతగా పుంజుకోవాలన్నది లక్ష్మి వ్యూహం.

దీనిలో భాగంగా ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేసి సంప్రదించిన వారికి ఆమె అండగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలో నేనున్నానంటూ ఆమె తరచుగా పర్యటనలు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన నాయకురాలుగా ఆమె ప్రజాదర్బార్లు కూడా చేపడుతుండడం విశేషం. వాస్తవానికి ఈ కార్యక్రమాలు ఎమ్మెల్యేలు చేపట్టాలని చెప్పినప్పటికీ దర్శి నియోజకవర్గం లో గొట్టిపాటి లక్ష్మీ ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

కూటమి నాయకుల సహకారంతోపాటు ప్రభుత్వ సహకారం కూడా లక్ష్మికి మెండుగానే ఉందన్నది వాస్తవం. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా దర్శి నియోజకవర్గం లక్ష్మీ ఖాతాలో పడుతుందనే చర్చ నడుస్తోంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎంత పోటీ నెలకొన్నప్పటికీ లక్ష్మీ విజయాన్ని రాసి పెట్టుకోవచ్చని టిడిపి నాయకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య సఖ్యత బాగానే ఉంది. లక్ష్మికి పోటీ ఇవ్వగలిగే నాయకులు కానీ పోటీ ఇవ్వాలని భావించే నాయకులు కానీ లేకపోవడం ఆమెకు కలిసి వస్తున్న మరో కీలక అంశం. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి గొట్టిపాటి లక్ష్మీ ఖచ్చితంగా విజయం సాధించి తీరుతారని అంచనా వేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu