Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తాం.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన

ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తాం.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన

Tupaki.com 6 days ago

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలను అంగీకరించమని మాజీ సీఎం జగన్మోహనరెడ్డి చేసిన హెచ్చరికలపై పరోక్షంగా స్పందించారు.

పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో స్థానిక ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ''ఎక్కడైనా ఏకగ్రీవాలు అయితే వదిలిపెట్టం అని అంటున్నారు. ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకుంటామంటే మీరేం చేయగలరు' అంటూ సీఎం సవాల్ చేశారు. ఏకగ్రీవాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని గుర్తు చేశారు. గ్రామాల్లో గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా పంచాయతీల్లో పార్టీ సింబల్ లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి కారణం కూడా ఉందన్నారు.

స్థానిక ఎన్నికల్లో మంచివారిని ఎన్నుకోవాలని సీఎం ప్రజలకు సూచించారు. మున్సిపాలిటీల్లో అయారాం.. గయారాంలను పెట్టుకుని పాలన సాగించలేమని భావించి ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆరు నెలలకు ఒకసారి మున్సిపల్ చైర్మన్లు మారే పరిస్థితి ఉండదని, ప్రత్యక్ష విధానంలో మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికోవడం ద్వారా ఐదేళ్లు పదవుల్లో కొనసాగుతారని సీఎం స్పష్టం చేశారు. ఇక 1996 నుంచి 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను గత ప్రభుత్వం తగ్గించేసిందని చంద్రబాబు ఆరోపించారు. ఓటమి భయంతో స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని, కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోతామని వైసీపీ భయపడుతోందని సీఎం ఎద్దేవా చేశారు.

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి తిరుగులేదని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అందుకే గొడ్డలి పార్టీ భయ పడుతోందని వ్యాఖ్యానించారు. ఓటర్ల రివిజన్ పూర్తయ్యే వరకూ ఎన్నికలకు వెళ్లొద్దని కోర్టుల్లో కేసులు వేశారని విమర్శించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరక్కుండా అడ్డుకోవాలని చూస్తున్నారని, చిత్తు చిత్తుగా ఓడిపోతామనే ఆలోచనతోనే ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ప్రభుత్వాలు ఉంటేనే అభివృద్ధి... అవి లేకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు స్థానికంగా వార్డు సభ్యులు, సర్పంచులు ఉండాలని స్పష్టం చేశారు. అప్పుడే కేంద్రం నుంచి స్థానిక సంస్థల అభివృద్ధికి నిధులు వస్తాయని వివరించారు. ఎన్నికల్లో డబ్బులు తీసుకునే కలుషితాన్ని కడిగేయాలి, ఎన్నికల్లో డబ్బులు అనే వ్యవహారం ఇక ముగిసిపోవాలి. ఆ కలుషితాన్ని అంతా కలిసి కడిగేద్దాం అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

వార్ వన్ సైడేనా?

ఇక ప్రత్యక్ష ఎన్నికలతోపాటు ఏకగ్రీవాలపై సీఎం చేసిన ప్రకటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఏకగ్రీవాలకు అంగీకరించనంటూ మాజీ సీఎం జగన్మోహనరెడ్డి తన కేడర్ ను హెచ్చరిస్తుంటే, ఏకగ్రీవాలు జరిగి తీరతాయంటూ సీఎం చేసిన ప్రకటన రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోందని అంటున్నారు. సీఎం ప్రకటనతో అధికార కూటమి నేతలు మరింత దూకుడుగా ఏకగ్రీవాలకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రయత్నాలను విపక్షం ఎలా ఎదుర్కొంటుందనేది చూడాల్సివుందని అంటున్నారు. మొత్తానికి స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఉభయ పక్షాలు తగ్గేదేలే అన్నట్లు సంకేతాలిస్తుండటంతో లోకల్ పోల్స్ ఉత్కంఠను పెంచేస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu