Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏకగ్రీవాలు....వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందా ?

ఏకగ్రీవాలు....వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందా ?

Tupaki.com 3 weeks ago

కగ్రీవాలు అన్నవి స్థానిక సంస్థలలో మామూలు విషయమే. గతంలో ప్రభుత్వాలే ప్రోత్సహిస్తూ వచ్చాయి. ముఖ్యంగా గ్రామ స్థాయిలో వర్గాలుగా విడిపోకుండా అంతా కట్టుగా ఉండాలని అందుకే ఆమోదయోగ్యమైన అభ్యర్ధిని ఎన్నుకుంటే ఆయా పంచాయతీలకు ప్రభుత్వమే ఆర్ధిక ప్రోత్సాహం ఇచ్చే విధానం ఉంటూ వచ్చింది.

గ్రామాల్లో గ్రూపు రాజకీయాల వల్ల వచ్చే గొడవలను నివారించి గ్రామాభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని ఏకగ్రీవ ఎన్నికల ప్రోత్సాహక పథకం అని అంటారు. దీని ద్వారా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆ గ్రామాలకు ప్రత్యేక నిధులను బహుమతిగా అందిస్తారు. ముఖ్యంగా గ్రామాలలో ప్రశాంత వాతావరణం కోసమే ఏకగ్రీవాల పధకాన్ని తీసుకుని వచ్చారు. ఎన్నికల వల్ల గ్రామాల్లో వర్గ పోరాటాలు, గొడవలు జరగకుండా చూడటం.ఖర్చుల పొదుపు కోసమే ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నారు.

ఏకగ్రీవాలు నాడు ముద్దు :

అయితే గ్రామ స్థాయిలో ఏకగ్రీవాలకు అభ్యంతరాలు లేవు కానీ దానిని మండల జిల్లా మున్సిపల్ స్థాయిలో అమలు చేస్తూ 2021 లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ రాజకీయ దూకుడు చేసింది. దాంతో అనేక చోట్ల ప్రత్యర్ధులు నామినేషన్లు వేయలేకపోయారు. అంతకు ముందు వరకూ ఈ తరహా విధానం లేదు, అధికార పార్టీకి మొగ్గు ఉన్నా కూడా ప్రత్యర్ధులు పోటీ చేసి తమ బలాన్ని చాటుకునే వారు. ఒకవేళ జనాలు మెచ్చితే వారు గెలిచేవారు. కానీ వైసీపీ హయాంలో అన్ని చోట్లా ఏకగ్రీవాలు పేరుతో చేసిన రాజకీయ జోరు ఇపుడు అదే పార్టీకి ఇబ్బందిగా మారింది అని అంటున్నారు. నాడు ఏకగ్రీవాలు ముద్దు ఇపుడు వద్దా అని వైసీపీని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు.

బాబు సంచనల వ్యాఖ్యలు :

ఇక తాజాగా అరకు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ ఏకగ్రీవాల విధానం మీద మండిపడ్డారు. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు కావాలన్నది వీరే అని, ఇపుడు అధికారం పోయాక ఏకగ్రీవాలు వద్దు అని కొత్త రాగం అందుకుంటున్నారు అని విమర్శించారు. ఇదేమి తీరు అని బాబు వైసీపీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలపైనా పూటకో మాట వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని బాబు ఎద్దేవా చేశారు. గతంలో ఏకగ్రీవమని ఇప్పుడు ఎక్కడా కాకూడదనటం విడ్డూరంగా ఉందని అన్నారు. అయితే దీనికి వైసీపీ జవాబు ఏమి చెబుతున్నది అన్నది పక్కన పెడితే సొంత పార్టీ నేతలు కూడా ఇదే విషయం మీద మధనపడుతున్నారు.

టికెట్లు దక్కవంటూ :

వైసీపీ ఇంచార్జీలకు ఇపుడు ఏకగ్రీవాల భయం పట్టుకుంది అని అంటున్నారు. తమ నియోజకవర్గాలలో ఏకగ్రీవాలు ఎక్కడైనా జరిగితే ఆ ఇంచార్జి ఇక తమ ఎమ్మెల్యే టికెట్ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే అని జగన్ తాజా మీటింగ్ లో స్పష్టం చేశారు. దాంతో వైసీపీలో ఇంచార్జిలు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు. స్థానిక ఎన్నికలు తమ ప్రాణాల మీదకు రాజకీయ భవిష్యత్తు మీదకు వచ్చాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ కచ్చితంగా ఏకగ్రీవాలకు ప్రయత్నం చేస్తుందని గతంలో తామూ ఇదే చేశామని వారు అంటున్నారు. ఆనాడు వైసీపీ చేసింది కరెక్ట్ అయితే ఇపుడు కూటమిది అదే దారి కదా అని అంటున్నారు. కానీ ఇపుడు ఏకగ్రీవాలు వద్దు అనడం ద్వారా తమ మెడ మీద కత్తి పెడుతున్నట్లుగా ఉందని కొంతమంది నేతలు అంతర్మధనం చెందుతున్నారు. ఏకగ్రీవాల విషయంలో వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుంటోంది అన్న మాట వినిపిస్తోంది. చంద్రబాబు విమర్శించడానికి కూడా ఇదే కారణం అంటున్నారు. ఏది ఏమైనా ఏకగ్రీవాలు కచ్చితంగా జరుగుతాయని మరి ఎంతమందికి టికెట్లు ఇవ్వకుండా వైసీపీ తన విధానం అమలు చేస్తుందో చూడాలని కూడా అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu