Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫ్లాప్ తర్వాత నటుడిగా ఓకే చెప్పడం తప్పా?

ఫ్లాప్ తర్వాత నటుడిగా ఓకే చెప్పడం తప్పా?

Tupaki.com 4 days ago

సినీ ఇండస్ట్రీలో హిట్లు, ఫ్లాపులు చాలా కామన్. ఒక మూవీ డిజాస్టర్ అయిందని టాలెంట్ ముగిసిపోయిందని చెప్పలేం. కానీ సోషల్ మీడియా కాలంలో మాత్రం ప్రతి నిర్ణయం మీద ట్రోలింగ్ మొదలవుతోంది.

ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ విషయంలో కూడా ఇదే చర్చ నడుస్తోంది. దర్శకుడిగా కొన్ని నిరాశలు ఎదుర్కొన్న తర్వాత ఆయన నటుడిగా మరో సినిమాకు ఓకే చెప్పారనే వార్తలు హాట్ టాపిక్ గా మారింది.

తమిళ సినీ పరిశ్రమలో కార్తీక్ సుబ్బరాజ్ కు స్పెషల్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. పిజ్జా, జిగర్తాండ, పేట వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్ సంపాదించుకున్నారు. కథల ఎంపికలో కొత్తదనం, డార్క్ హ్యూమర్, ఇంటెన్స్ స్క్రీన్‌ ప్లే ఆయన ప్రత్యేకత. అయితే ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించకపోవడంతో ఆయన కెరీర్‌ పై సోషల్ మీడియాలో అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇలాంటి సమయంలో సూపర్ డీలక్స్ తర్వాత విజయ్ సేతుపతి, త్యాగరాజన్ కుమారరాజా కాంబినేషన్‌ లో వస్తున్న పాకెట్ నావెల్ చిత్రంలో కార్తీక్ సుబ్బరాజ్ నటించే అవకాశముందనే వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో కొందరు ట్రోల్ చేయడం ప్రారంభించారు. దర్శకుడిగా అవకాశాలు తగ్గిపోవడంతో నటుడిగా మారుతున్నారని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, దర్శకుడు నటుడిగా మారడంలో తప్పేమీ లేదని మద్దతు ఇస్తున్నారు.

నిజానికి కార్తీక్ సుబ్బరాజ్‌ కు నటన కొత్త కాదు. విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన సూదు కవ్వుమ్ సినిమాలో ఆయన చిన్న క్యామియో రోల్ చేశారు. దర్శకుడిగా మారకముందు షార్ట్ ఫిలిమ్స్, స్టేజ్ ప్రదర్శనల్లో కూడా నటించారు. అంటే ఆయనకు నటనపై ఆసక్తి చాలా కాలంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు అదే ఇంట్రెస్ట్ మళ్లీ స్క్రీన్ పై చూపించాలని చూస్తున్నారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

అసలు చూస్తే దర్శకులు నటులుగా మారడం కొత్త ట్రెండ్ కాదు. సౌత్ తో పాటు బాలీవుడ్‌ లో కూడా చాలామంది దర్శకులు నటులుగా సక్సెస్ అయ్యారు. తమిళ దర్శకుడు సముద్రఖని ఇందుకు బెస్ట్ ఉదాహరణ. దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా మారి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు.

తెలుగులో తరుణ్ భాస్కర్ కూడా దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విశ్వక్ సేన్ అయితే దర్శకుడిగా మొదలై స్టార్ హీరో స్థాయికి చేరుకున్నారు. జేడీ చక్రవర్తి కూడా దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేశారు. సినిమా రంగంలో ఒక వ్యక్తి ఒక్క విభాగానికే పరిమితం కావాల్సిన అవసరం లేదు. దర్శకత్వం, నటన, నిర్మాణం.. ఇలా ఒకేసారి అనేక డిపార్ట్మెంట్స్ లో పని చేసే వాళ్లు చాలామందే ఉన్నారు.

అందుకే కార్తీక్ సుబ్బరాజ్ నటుడిగా ప్రయత్నించడం తప్పు కాదనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. మొత్తానికి ఫ్లాప్ వచ్చిన తర్వాత కొత్త దారులు వెతకడం తప్పు కాదు. ప్రేక్షకులు చివరికి టాలెంట్‌ నే చూస్తారు. దర్శకుడైనా, నటుడైనా.. సిల్వర్ స్క్రీన్ పై ఆకట్టుకుంటే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ విషయంలో కూడా అదే జరుగుతుందా లేదా అనేది చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu