Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'హాట్ ఇండియా'లో 'కూల్' ఏసీలు.. ఆల్-టైమ్ రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం!

'హాట్ ఇండియా'లో 'కూల్' ఏసీలు.. ఆల్-టైమ్ రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం!

Tupaki.com 2 days ago

దేశవ్యాప్తంగా వేసవి ఎండలు మంటలు పుట్టిస్తున్నాయి. భానుడి భగభగలతో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఎండల తీవ్రత, వడగాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో విద్యుత్తు వినియోగం అమాంతంగా పెరిగిపోయింది. ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలు ఫ్యాన్ గాలిలో సేదదీరడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏసీలు, కూలర్ల వినియోగం కూడా రెట్టింపు కావడంతో విద్యుత్ సరఫరాపై తీవ్ర ఒత్తిడి పెరిగిపోయిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులతో విద్యుత్ డిమాండ్ ఎన్నడూ లేని విధంగా ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది.

270.82 గిగావాట్లకు చేరిన డిమాండ్

తాజా గణాంకాల ప్రకారం, దేశంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ ఏకంగా 270.82 గిగావాట్ల రికార్డు స్థాయిని తాకింది. దేశ చరిత్రలోనే ఒకే రోజు ఈ స్థాయిలో విద్యుత్ వినియోగం జరగడం ఇదే తొలిసారి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుండటమే ఈ భారీ డిమాండ్‌కు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా నమోదు అవుతుండటంతో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుకుందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, దేశీయ గ్రిడ్ వరుసగా నాలుగో రోజు కూడా రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్‌ను నమోదు చేసిందని అంటున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న లోడ్‌ను తట్టుకుంటూ జాతీయ గ్రిడ్ ఎలాంటి అంతరాయాలు లేకుండా, అత్యంత విజయవంతంగా దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాను సమర్థవంతంగా అందిస్తోందని ప్రభుత్వం తెలిపింది.

ఆగని ఏసీలు..

పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటుతుండటం, రాత్రి వేళల్లో సైతం ఉక్కపోత తగ్గకపోవడంతో ప్రజలు విధిలేని పరిస్థితుల్లో ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్లపైనే ఆధారపడుతున్నారు. మెట్రో నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో సైతం గతంలో కంటే ఏసీల కొనుగోళ్లు, వినియోగం విపరీతంగా పెరగడం విద్యుత్ వినియోగాన్ని అమాంతం పెంచేసిందని చెబుతున్నారు. సాధారణంగా వేసవి కాలంలో విద్యుత్ కొరత ఏర్పడటం, పవర్ కట్స్ విధించడం జరుగుతూనే ఉంటుంది. అయితే, ఈసారి రికార్డు స్థాయిలో 270.82 గిగావాట్ల డిమాండ్ ఏర్పడినప్పటికీ, కేంద్ర విద్యుత్ శాఖ ముందస్తు ప్రణాళికల వల్ల గ్రిడ్ కుప్పకూలకుండా మేనేజ్ చేయగలిగారని అంటున్నారు. బొగ్గు నిల్వలను సమకూర్చుకోవడం, పునరుత్పాదక ఇంధన వనరులను గరిష్టంగా వినియోగించుకోవడం వల్ల ఈ గండం గట్టెక్కిందని చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu