Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హర్రర్ శృతిమించి సెన్సార్ రిజెక్ట్.. ఇదేమి చోద్యం?

హర్రర్ శృతిమించి సెన్సార్ రిజెక్ట్.. ఇదేమి చోద్యం?

Tupaki.com 2 weeks ago

సినిమాల్లో బూతులు ఎక్కువయ్యాయని.. శృంగారం హద్దులు మీరిందని.. రక్తం ఏరులై పారుతోందని లేదా కులమత ఘర్షణలకు తావిచ్చేలా ఉందనే కారణాలతో సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదా సర్టిఫికెట్ నిరాకరించడం మనకు కొత్తేమీ కాదు.

కానీ ఒక హర్రర్ సినిమాను చూసి "ఇందులో భయం ఎక్కువైంది" అనే విచిత్రమైన కారణంతో సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వకుండా తిరస్కరించడం బహుశా భారతీయ చిత్రసీమ చరిత్రలోనే వినని వింత పరిస్థితి. ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న '418' అనే తెలుగు హర్రర్ థ్రిల్లర్ సినిమా విషయంలో సరిగ్గా ఇటువంటి చోద్యమే చోటుచేసుకుంది.

కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ వద్ద పనిచేసిన కీర్తన్ నాడగౌడ దర్శకత్వం వహించిన 418 చిత్రంలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రలు పోషించారు. వాస్తవానికి ఈ సినిమా జులై 31నే విడుదల కావాల్సి ఉంది. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సి) రివిజన్ కమిటీ ఈ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి పదే పదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దరఖాస్తును రిజెక్ట్ చేసింది. ఇందులో ఉన్న సీన్లు అత్యంత భయానకంగా.. తీవ్రమైన హర్రర్ అంశాలతో ఉన్నాయని.. అందుకే అనుమతి ఇవ్వలేకపోతున్నామని సెన్సార్ వర్గాలు వెల్లడించడం అందరినీ తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది.

ఒక హర్రర్ సినిమాకు ప్రధాన ఉద్దేశమే ప్రేక్షకులను భయపెట్టడం. అటువంటప్పుడు హర్రర్ సినిమాలో హర్రర్ ఎక్కువైందని నిలిపివేయడం ఏ రకమైన న్యాయమని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నెటిజనులు తమదైన స్టైల్ లో సెటైర్లు వేస్తున్నారు. దీంతో సెన్సార్ బోర్డు వైఖరిపై ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఎక్స్‌ట్రీమ్ వయలెన్స్ ఉన్న 'A' సర్టిఫికేట్ సినిమాలకు సునాయాసంగా అనుమతులిచ్చే బోర్డు.. హర్రర్ జోనర్ నుంచి ప్రేక్షకులు కోరుకునే కంటెంట్‌ను సరిగ్గా అందించిన '418' లాంటి చిత్రానికి ఎందుకు అడ్డుపడుతోందో అర్థం కావడం లేదని విశ్లేషకులు మండిపడుతున్నారు.

ఇంతటి నిర్మాణ విలువలు ఉన్న మైత్రి మూవీ మేకర్స్ వంటి అగ్ర సంస్థ నిర్మించిన ఒక సినిమాకు ఇలాంటి పరిస్థితి దాపురించడం చూస్తుంటే.. అసలు సెన్సార్ అధికారుల అభ్యంతరం ఏమిటో అంటూ ప్రజల్లో చర్చ మొదలైంది. భారతీయ ప్రేక్షకులు ఇంకా 'ది ఎక్సార్సిస్ట్', 'ఈవిల్ డెడ్', 'ది నన్' వంటి అంతర్జాతీయ హర్రర్ క్లాసిక్స్ చూడలేదని భావిస్తున్నారా? థియేటర్లలో ఈ సినిమా చూస్తే జనాలు ఎక్కడ కుప్పకూలిపోతారోనని భయపడుతున్నారా? అసలు సెన్సార్ బోర్డు వాళ్లే భరించలేక పారిపోయేంత భయంకరమైన సీన్లు ఈ సినిమాలో ఏమున్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ రెట్టింపైంది.

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ వార్తతో 418 సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయనడంలో సందేహం లేదు. సాధారణంగా నిషేధాలు, వివాదాలు సినిమాలకు అనవసరమైన ప్రచారాన్ని తెచ్చిపెడతాయి. సెన్సార్ బోర్డు ఎంతగా భయపడి రిజెక్ట్ చేసిందో అంతటి భయానక దృశ్యకావ్యాన్ని థియేటర్లలో కచ్చితంగా చూసి తీరాల్సిందేనని సినీ ప్రియులు ఫిక్స్ అవుతున్నారు. మరి ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో, '418' చిత్రం చివరకు సెన్సార్ గండం దాటుకుని ఎప్పుడు వెండితెరపైకి వస్తుందో వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu