Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జడల్.. పాన్ ఇండియా మార్కెట్ సవాల్

జడల్.. పాన్ ఇండియా మార్కెట్ సవాల్

Tupaki.com 2 weeks ago

నాని కెరీర్‌లోనే బిగ్ బడ్జెట్ తో వస్తున్న సినిమా 'ది ప్యారడైజ్'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జడల్‌గా పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.

సెప్టెంబర్ 24న సినిమాను ఎనిమిది భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ వరకు వెళ్తున్నారు. అయితే ఇంత పెద్ద రిలీజ్ ప్లాన్ చేస్తున్నప్పుడు నాని గత సినిమాలు ఇతర భాషల్లో ఎలా ఆడాయన్న వివరాల్లోకి వెళితే..

శ్రీకాంత్ ఓదెలతో నాని చేసిన 'దసరా' కూడా పాన్ ఇండియా సినిమాగానే వచ్చింది. సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.118 కోట్లకు పైగా గ్రాస్ చేసింది. కానీ అందులో ఎక్కువ వసూళ్లు తెలుగు వెర్షన్ నుంచే వచ్చాయి. హిందీలో దాదాపు రూ.4.67 కోట్ల నెట్ రాగా, తమిళంలో రూ.89 లక్షలు, మలయాళంలో రూ.42 లక్షల దగ్గరే ఆగింది. అంటే సినిమా హిట్ అయింది కానీ నానికి అనుకున్నంత రేంజ్ లో పాన్ ఇండియాలో క్రేజ్ తీసుకు రాలేదు.

ఆ తర్వాత వచ్చిన 'హాయ్ నాన్న'ను కూడా తెలుగు ఒక్కటితో పరిమితం చేయలేదు. తమిళం, హిందీతో పాటు ఇతర భాషల్లో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సినిమా రూ.76 కోట్లకు పైగా గ్రాస్ చేసింది. కానీ తమిళ వెర్షన్ ఇండియా నెట్ దాదాపు రూ.1.91 కోట్లు మాత్రమే. హిందీ వెర్షన్ రూ.11 లక్షల దగ్గరే ఉంది. విదేశాల్లో మాత్రం సినిమా రూ.18.5 కోట్ల వరకు గ్రాస్ చేయడం విశేషం. అందుకే ఈసారి ఒక సాంగ్ తో అమెరికాలో ప్యారడైజ్ వైబ్ స్టార్ట్ చేశాడు.

ఇక 'ది ప్యారడైజ్'కు హిందీ మార్కెట్ ఒక్కటే ముఖ్యం కాదు. తమిళనాడులో నాని సినిమాకు ఓపెనింగ్ రావాలి. కేరళలో మలయాళ స్టార్ సినిమాల మధ్య చోటు సంపాదించాలి. కన్నడలో కూడా డబ్బింగ్ వెర్షన్‌కు ప్రేక్షకులు రావాలి. పాన్ ఇండియా రిలీజ్ అంటే ఐదు భాషల్లో పోస్టర్లు వేయడం వరకు కాదు. తెలుగు బయట ఒక్కో రాష్ట్రంలో నానికి థియేట్రికల్ ప్రేక్షకుడు ఎంతవరకు తయారయ్యాడన్నది ఈ సినిమాతో తెలుస్తుంది.

ఈసారి టీమ్ కూడా ఆ లెక్కకు తగ్గట్టుగానే సినిమా పరిధిని పెంచుతోంది. 'దసరా' తర్వాత శ్రీకాంత్ ఓదెల, నాని మళ్లీ కలిసి చేస్తున్నారు. రాఘవ్ జుయాల్, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు లాంటి నటులు ఉన్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. టీజర్‌ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఒకేసారి రిలీజ్ చేశారు. తర్వాత బెంగాలీతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ వెర్షన్లు కూడా థియేటర్లకు తీసుకెళ్లే ప్లాన్ ఉంది.

సెప్టెంబర్ 24న 'జడల్'కు తెలుగులో ఓపెనింగ్స్ రావడంపై పెద్ద సందేహం లేదు. అసలు కొత్త లెక్క ఆ తర్వాత మొదలవుతుంది. చెన్నై, బెంగళూరు, కొచ్చి, ముంబై లాంటి మార్కెట్లలో మొదటి వీకెండ్ తర్వాత కూడా షోలు నిలబడితే నాని తర్వాతి సినిమాలకు పాన్ ఇండియా క్రేజ్ వస్తుంది. 'దసరా', 'హాయ్ నాన్న'తో మొదలైన పాన్ ఇండియా ప్లాన్స్ ఈసారి ఎక్కడి వరకు వెళతాయో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu