Dailyhunt
జగన్ 'మావిగన్'.. చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

జగన్ 'మావిగన్'.. చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

Tupaki.com 1 month ago

రాజధాని అమరావతి పేరు ఉచ్చరించడానికి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మనసొప్పడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అమరావతిపై నిత్యం విషం కక్కడమే జగన్ నైజమని, అమరావతి అంటేనే అతడికి కంపరం పట్టుకుంటుందని సీఎం చంద్రబాబు విమర్శించారు.

రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం లభించిన సందర్భాన్ని చారిత్రక విజయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. కూటమి నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మాజీ సీఎం జగన్ పై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాజధాని బిల్లును ఆమోదించిన కేంద్రానికి ప్రతిఒక్కరూ ధన్యవాదాలు తెలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలని సూచించారు. తాను మధ్యాహ్నం ఉద్దండరాయునిపాలెంలో జరిగే సంబరాల్లో పాల్గొంటానని చంద్రబాబు వెల్లడించారు. మా రాజధాని అమరావతి అన్న భావన ప్రతి ఒక్కరికీ రావాలని చంద్రబాబు సూచించారు. రాజధాని బిల్లు పాస్ అయినందున ఈ రోజు సాయంత్రం ప్రతి గ్రామంలో వేడుకలు నిర్వహించాలని కూటమి నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు.

కూటమి నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అమరావతికి బదులుగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధాని ప్రాంతంగా ప్రకటించాలని మాజీ సీఎం జగన్ ప్రతిపాదనలపై సీఎం ఘాటుగా స్పందించారు. అమరావతి ఏపీ ప్రజల సెంటిమెంటు అని పేర్కొన్నారు. ఐదేళ్ల పాటు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు మావిగన్ అంటూ వింత పేర్లు పెడుతున్నారని ఆక్షేపించారు. ఇలాంటి ప్రతిపాదనలతో అమరావతిపై వారికి ఉన్న ద్వేషాన్ని బయటపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ రాజధానిలో ఉన్న ఎస్ఆర్ఎం కళాశాలకు ''ఎస్ఆర్ఎం అమరావతి'' అని పేరు ఉంటే అమరావతిని తీసేయాలని యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువచ్చారని చంద్రబాబు ఆరోపించారు.

అమరావతిపై జగన్ వైఖరి భవిష్యత్తులో కూడా మారదని నిన్నటితో మరోసారి స్పష్టమైందని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ఐదేళ్లు మీకు మూడు రాజధానులా అంటూ అందరూ ఎగతాళి చేశారని, అమరావతి చట్టం ద్వారా ఏకైక రాజధాని అన్న గౌరవం దక్కిందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. మన రాజధానికి స్థిరత్వం దక్కేలా చేసిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి సవ్యంగా జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu