Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జెన్-Z రెఢీ: ఇక్కడ పవన్ వారసుడు- అక్కడ సూర్య వారసుడు!

జెన్-Z రెఢీ: ఇక్కడ పవన్ వారసుడు- అక్కడ సూర్య వారసుడు!

Tupaki.com 2 days ago

భారతీయ సినీరంగంలో దిగ్గజాల నటవారసులు బరిలోకొస్తున్నారు. కొందరు సౌత్ ఇండస్ట్రీ స్టార్ల వారసుల వయసు సుమారు 15 నుంచి 22 మధ్యలో ఉంది. టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారసుడు అకీరా నందన్ (22), సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ (19) శరవేగంగా ఎదిగేస్తున్నారు.

భవిష్యత్తులో స్టార్ రేస్‌లోకి రాబోయే స్టార్ కిడ్స్ జాబితా ఇక్కడితోనే ఆగడం లేదు. మాస్ మహారాజా రవితేజ వారసుడు మహాధన్ (18) కూడా ఇప్పటికే నూనూగు మీసాల దశ నుంచి మిస్టర్ గా మారుతున్నాడు. వీరంతా వస్తే పెద్దతెరకు మరింత గ్లామర్ ని అద్దినట్టేననడంలో ఎలాంటి సందేహాలు లేవు. టాలీవుడ్‌లో ఈ ముగ్గురు కుర్రాళ్లు భవిష్యత్తు స్టార్లుగా ఎలా ఎదుగుతారో అనే ఆసక్తి అభిమానులతో పాటు, ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పటికే మొదలైంది.

ఇంచుమించు ఇదే జనరేషన్ రేస్‌లో తమిళ చిత్ర పరిశ్రమ (కోలీవుడ్) నుండి సింగం సూర్య నటవారసుడు దేవ్ (15) కూడా బరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ స్టార్ కిడ్స్ అందరూ కచ్చితంగా సినిమాల్లోకి వస్తారా లేదా రాబోయే రోజుల్లో వేరే రంగాన్ని ఎంచుకుంటారా అనే విషయంపై వారి తల్లిదండ్రుల నుండి ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదు. అయితే సినీ ఇండస్ట్రీలోని సహజ సిద్ధమైన నటన, గ్లామర్ వాతావరణం అంతిమంగా ఈ కుర్రాళ్లను తన పద్మవ్యూహంలోకి లాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం వీరంతా తమ అకడమిక్ స్టడీస్ పూర్తి చేసే పనిలో విదేశీ చదువులతో బిజీగా ఉన్నారు. వారి విద్య పూర్తి కాగానే వెండితెర ఎంట్రీపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, ఇటీవల చెన్నైలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం `కరుప్పు` ప్రీమియర్ షో వైభవంగా జరిగింది. ఈ ప్రత్యేకమైన ఈవెంట్‌కు స్టార్ హీరో సూర్య తన కుటుంబంతో కలిసి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా మీడియా ముందుకు ఎక్కువగా రాని సూర్య-జ్యోతికల వారసులు, కుమార్తె దియా -కుమారుడు దేవ్ ఈ వేడుకలో సందడి చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. తమ తల్లి నటించిన ఈ విభిన్నమైన చిత్రానికి మద్దతుగా నిలిచేందుకు వచ్చిన ఈ ఇద్దరు ఎదిగేస్తున్న పిల్లలను చూడగానే భవిష్యత్తు నటవారసులుగా వెలిగిపోవడం ఖాయమని అభిమానులు అంచనాలు వేయడం ప్రారంభించారు.

ఈ కరుప్పు ఈవెంట్‌లో దియా, దేవ్ ఇద్దరూ ఎంతో హుందాగా, సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోతూ కనిపించారు. ముఖ్యంగా సూర్య నటవారసుడు దేవ్ అచ్చుగుద్దినట్టు తండ్రిలానే సింగం లుక్‌లో కనిపిస్తుండగా.. కుమార్తె దియా మాత్రం తల్లి జ్యోతిక రూప శైలిని తలపిస్తోంది. ఈవెంట్‌కు విచ్చేసిన అతిథులను ఎంతో వినయంతో చిరునవ్వుతో పలకరిస్తూ ఈ స్టార్ కిడ్స్ కెమెరాలకు ఫోజులిచ్చారు. సినిమా పరిశ్రమలో అంతటి భారీ స్టార్ హోదా ఉన్నా. తమ పిల్లలను ఎంతో క్రమశిక్షణతో సాధారణ జీవితానికి అలవాటు చేస్తూ పెంచారనే ప్రశంసలు ఈ వేడుక ద్వారా సూర్య-జ్యోతిక దంపతులకు దక్కాయి.

ప్రస్తుతానికైతే పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రవితేజ, సూర్య, మాధవన్ (వేదాంత్ -20) వంటి స్టార్ల కుటుంబాల నుంచి వారసులు వేగంగా ఎదిగేస్తుంటే అభిమానుల్లో ఉత్సాహం అంతకంతకు పెరుగుతోంది. అయితే స్టార్ కిడ్స్ తమ భవిష్యత్తు విషయంలో ఏం ఆలోచిస్తున్నారో ఎవరికీ తెలియదు. వారు ఎలా ఆలోచించినా.. అంతిమంగా విధి వారిని ఎటువైపు లాక్కెళుతుందో మనం ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం. కానీ ప్రస్తుతం వారి ఎదుగుదల.. గ్లామర్ రంగంతో క్లోజవ్వడం చూస్తుంటే మరో నాలుగైదేళ్లలోనే వీరంతా నటనలోకి అడుగుపెడతారా లేదా? అన్నదానిపై ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. ఒకవేళ వీరంతా ఇండస్ట్రీలోకి వస్తే... సౌత్ ఇండియన్ సినిమాలో మరో క్రేజీ స్టార్ వార్‌ను ప్రేక్షకులు చూడవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu