Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కార్మికుల కష్టాలు..పరిశ్రమ మూతపడే ప్రమాదం!

కార్మికుల కష్టాలు..పరిశ్రమ మూతపడే ప్రమాదం!

Tupaki.com 2 days ago

ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తెరపై కనిపించే గ్లామర్, వెలుగుల వెనుక వేలాది మంది కార్మికుల కన్నీళ్లు దాగి ఉన్నాయనే చేదు నిజాన్ని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) ప్రతినిధులు బహిర్గతం చేశారు.

చలనచిత్ర కార్మికుల సంక్షేమం, వారి పని పరిస్థితులు గనుక మెరుగుపడకపోతే రాబోయే రోజుల్లో మొత్తం హిందీ చిత్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందని చివరికి పరిశ్రమ పూర్తిగా మూతపడే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమలో నటీనటులు, దర్శకులు మాత్రమే కాకుండా తెర వెనుక రాత్రింబవళ్లు శ్రమించే లైట్ మెన్, స్పాట్ బాయ్స్, ఆర్ట్ డైరెక్టర్లు ,చిన్న తరహా కళాకారులు వేలాది మంది ఉంటారు.

ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, ఓటీటీ విప్లవం పెరిగిన తర్వాత కంటెంట్ ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. అయితే ఈ వేగవంతమైన నిర్మాణ ప్రక్రియలో నాణ్యత కంటే అవుట్‌పుట్ కోసమే మేకర్స్ చూస్తున్నారని దీంతో రోజువారీ వేతన కార్మికులే అత్యధికంగా నష్టపోతున్నారని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.

పరిశ్రమలో ఉన్న ప్రధాన సమస్యలలో పని గంటల నియంత్రణ లేకపోవడం ఒకటని తెలుస్తోంది. సాధారణంగా ఎనిమిది గంటల పని దినం ఉండాల్సి ఉండగా, కార్మికులతో ఏకంగా 20 గంటల పాటు నిర్విరామంగా పని చేయించుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

అంతగా శ్రమ దోపిడీ జరుగుతున్నా? వారికి కనీసం ప్రాథమిక ఎనిమిది గంటలకు రావాల్సిన వేతనాన్ని కూడా సకాలంలో చెల్లించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కార్మికుల హక్కులను పూర్తిగా కాలరాస్తూ శ్రమను ఉచితంగా వాడుకుంటున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. మరోవైపు ఇండస్ట్రీలో ఉపాధి అవకాశాలు తగ్గడం వల్ల కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కుటుంబాలను పోషించుకోవడానికి, కడుపు నింపుకోవడానికి వేరే మార్గం లేక నిర్మాతలు ఇచ్చే తక్కువ వేతనాలకే రాజీ పడి పని చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. పని దొరకడమే గగనంగా మారిన ఈ రోజుల్లో ఎంత కష్టమైనా? భరిస్తూ, తక్కువ జీతాలకైనా వారు ఒప్పుకుంటున్నారు.

ఈ రకమైన ఆర్థిక అసమానతలు శ్రమజీవుల జీవితాలను రోడ్డున పడేస్తున్నాయి. డిజిటల్ ప్రాజెక్టులు , ఓటీటీ దిగ్గజాల కోసం చేసే నిర్మాణాల్లో వేతనాల చెల్లింపులో విపరీతమైన ఆలస్యం జరుగుతోందని కార్మిక సంఘం ఎత్తి చూపింది. షూటింగ్ పూర్తయిన కొన్ని నెలల వరకు కార్మికులకు డబ్బులు అందడం లేదు. కొన్ని సందర్భాల్లో వేతనాలు ఇవ్వాల్సిన సమయానికి సదరు నిర్మాణ సంస్థలు లేదా నిర్మాతల ఆచూకీ కూడా దొరకడం లేదంటున్నారు. దీంతో రోజువారీ కూలీలు ఎవరిని ఆశ్రయించాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే బాలీవుడ్ పరిశ్రమ పూర్తిగా స్తంభించిపోతుందని, వేలాది మంది కార్మికులు రోడ్డున పడే రోజులు ఎంతో దూరంలో లేవని అధ్యక్షులు బి.ఎన్. తివారీ హెచ్చరించారు. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న వాతావరణం ఏమాత్రం ఆశాజనకంగా లేదని కార్మికుల సమస్యలను అర్థం చేసుకుని వారికి తగిన న్యాయం జరిగేలా చూడటానికి ఫెడరేషన్ నిరంతరం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu