Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాస్ట్ కటింగ్ - బడ్జెట్ నియంత్రణపై నిర్మాతల ఫోకస్!

కాస్ట్ కటింగ్ - బడ్జెట్ నియంత్రణపై నిర్మాతల ఫోకస్!

Tupaki.com 3 days ago

ప్రస్తుత సినిమా రంగంలో బడ్జెట్ నిర్వహణ అనేది అగ్ర నిర్మాణ సంస్థల నుండి చిన్న నిర్మాతల వరకు పెద్ద సవాలుగా మారింది. ఒకప్పుడు సినిమా విజయం సాధిస్తే లాభాలు సమానంగా అందేవి.

కానీ నేడు వందల కోట్ల మార్కెట్ ఉన్నా? సరైన ప్రణాళిక లేకపోతే భారీ నష్టాలు చూడాల్సి వస్తోంది. దీంతో టాలీవుడ్ సహా పలు పరిశ్రమల్లో కాస్ట్ కటింగ్ అంశంపై నిర్మాతలు దృష్టిసారించారు. అనవసరపు ఖర్చులను అరికట్టడంతోనే సినిమాను సురక్షి తమైన జోన్‌లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరగడానికి ప్రధాన కారణం ప్రొడక్షన్ కాస్ట్ - నటీనటుల పారితోషికాలు.

భారీ చిత్రాల బడ్జెట్ వందల కోట్లకు చేరడంతో బాక్సాఫీస్ వద్ద సినిమా కలెక్షన్లు అద్భుతంగా ఉంటేనే పెట్టుబడి వెనక్కి వచ్చే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వ్యూహాలను మార్చుకుంటున్నారు. కథ డిమాండ్ మేరకు కాకుండా గ్రాండియర్ కోసం చేసే వృథా ఖర్చులకు స్వస్తి పలకాలని ప్రతి పైసా స్క్రీన్‌పై కనిపించేలా ప్లాన్ చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంటున్నారు. ఇందులో భాగంగా నిర్మాతలు మొదటగా ఫోకస్ పెట్టింది ఫారెన్ షెడ్యూల్స్ , అవుట్‌డోర్ షూటింగ్స్ తగ్గించడంపైనే. గతంలో పాటల కోసమో, చిన్న చిన్న సీన్ల కోసమో విదేశాలకు వెళ్లే సంస్కృతి ఎక్కువగా ఉండేది.

కానీ ఇప్పుడు అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ , గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ , వర్చువల్ ప్రొడక్షన్ అందుబాటులోకి రావ డంతో ఇక్కడి స్టూడియోల్లోనే అంతర్జాతీయ స్థాయి లొకేషన్లను సృష్టించగలుగుతున్నారు. దీంతో ప్రయాణ ఖర్చులు, క్రూ వసతి ఖర్చులు భారీగా మిగులుతున్నాయి. అలాగే షూటింగ్ సెట్స్‌లో విలాసవంతమైన ఖర్చులపై కూడా నిర్మాతలు గట్టి నిఘా పెడుతున్నారు. క్యారవాన్ల నిర్వహణ, నటీనటుల వ్యక్తిగత స్టాఫ్ (పర్సనల్ మేకప్ ఆర్టిస్టులు, స్టైలిస్టులు, బాడీగార్డ్స్) ఖర్చులు ఒక్కోసారి ప్రొడక్షన్ బడ్జెట్‌ను దాటిపోతున్నాయి.

ఈ విధమైన అదనపు భారాలను తగ్గించుకోవడానికి అవసరమైన సిబ్బందిని మాత్రమే అనుమతించేలా కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. స్టార్స్‌తో చర్చలు జరిపి ఈ తరహా ఖర్చులను నియంత్రించేందుకు నిర్మాతల మండలి సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రీ-ప్రొడక్షన్ దశలోనే పక్కాగా ప్లాన్ చేసుకోవడం ద్వారా ప్రొడక్షన్ రోజులను తగ్గించడం మరో కీలక వ్యూహం. షూటింగ్ రోజులు పెరిగేకొద్దీ వడ్డీల భారం, దినసరి బత్తాలు పెరుగుతాయి. అందుకే బౌండ్ స్క్రిప్ట్‌తో పక్కా షెడ్యూళ్లతో సెట్స్ పైకి వెళ్లడం ద్వారా అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

టెక్నాలజీని వాడుకుంటూ లొకేషన్ స్కౌటింగ్, రిహార్సల్స్ ముందే పూర్తి చేయడం వల్ల షూటింగ్ స్పాట్‌లో సమయం వృథా కాకుండా చూసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీ మనుగడ సాగించాలంటే క్రియేటివిటీతో పాటు వాణిజ్యపరమైన క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం. బడ్జెట్ నియంత్రణ అనేది సినిమా నాణ్యతను తగ్గించడం కాదు. వృథాను అరికట్టడం మాత్రమే అనే భావన పరిశ్రమలో బలపడుతోంది. నిర్మాతలు తీసుకుంటున్న కాస్ట్ కటింగ్ నిర్ణయాలు భవిష్యత్తులో చిత్ర పరిశ్రమను మరింత ఆరోగ్యకరమైన, లాభదాయకమైన మార్గంలో నడిపించడానికి దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu